తలసేమియా బాధితుల కోసం సోమవారం నగరంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించున్నట్లు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెల్లడించారు. రాజధాని నగరాన్ని రక్తదాతల కొరత తీవ్రంగా వేధిస్తోందని తెలిపారు. అంచనా ప్రకారం ఏడాదికి తెలంగాణ వ్యాప్తంగా 1.20-1.50 లక్షల యూనిట్ల రక్తం అవసరం ఉంటుందని వెల్లడించారు. కొవిడ్ వ్యాప్తికి ముందు అవసరానికి మించి ఏటా 2 లక్షల యూనిట్లకు పైగా రక్త సేకరణ జరిగేదని... ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.
లాక్‌డౌన్, కొవిడ్ ఆందోళన, ఇతరత్రా సమస్యలతో రక్తదానానికి ముందుకొచ్చేవారు సగానికిపైగా తగ్గారని మేయర్ తెలిపారు. ఇది తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలు, రక్తహీనత, ఇతరత్రా సమస్యలతో బాధపడేవారికి చికిత్స సమయంలో ఇబ్బంది తలెత్తుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఇబ్బందిపడుతున్నట్లు... తలసేమియా అండ్ సికిల్ సెల్ అనీమియా సొసైటీ సభ్యులు(Thalassemia and Sickle Cell Anemia Society Members) మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని సంప్రదించారు.
ఈ నేపథ్యంలో జూన్ 21న తన పుట్టినరోజును పురస్కరించుకుని తలసేమియా బాధితులకు అండగా నిలిచేందుకు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని... ఖాజా ఫంక్షన్ హాల్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు రక్తదాన కార్యక్రమం జరగనుందని తెలిపారు. సినీ హీరో నిఖిల్ అతిథిగా పాల్గొని రక్తదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. రక్తదానం చేసేందుకు ముందుకొచ్చే వారు 7093515573, 9030066666 ఫోన్ నెంబర్లను సంప్రదించి ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని మేయర్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: TS UNLOCK: తెలంగాణ అన్‌లాక్.. ఇవన్నీ ఓపెన్