హైదరాబాద్..ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వరద బాధితులకు ఆర్థిక సాయం అందలేదని భాజపా యువ మోర్చా ఆరోపించింది. వారికి సాయం అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించింది. సహాయం విషయంలో ప్రభుత్వ అధికారులు ఉదాసీన వైఖరిని వీడాలని డిమాండ్ చేశారు. బాధితులతో కలిసి ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్థిక సహకారం అందే వరకూ పోరాటం కొనసాగిస్తామని భీష్మించుకు కూర్చున్నారు.
నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో బాధితులు ఉన్నప్పటికీ నామమాత్రంగా కొందరికి మాత్రమే పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించి మమ అనిపించారని ఆరోపించారు. సాయం అందించడంలో రాజకీయాలు అనుసరించడం సమంజసం కాదన్నారు. తహసీల్దార్ జానకి సమస్యను జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని సర్ది చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు.
ఇవీ చదవండి: ఎక్కడెక్కడ ఎంత పంపిణీ చేశారనే వివరాలివ్వాలి: రేవంత్రెడ్డి