హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలంటూ భాజపా యువ మోర్చా కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
భాజపా ప్రధాన కార్యాలయం నుంచి 400 మంది నాయకులు ర్యాలీగా బయల్దేరి నిరసన వ్యక్తం చేశారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోపలికి చొచ్చుకుని వెళ్లారు. అక్కడ ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. గేటు బయట బైఠాయించారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. కంటి తుడుపు చర్యగా కేవలం 50 వేల పోస్టులను భర్తీ చేసి... సీఎం కేసీఆర్ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ మండిపడ్డారు. తక్షణమే ఖాళీగా ఉన్న ఒక లక్ష 50వేల పోస్టులను భర్తీ చేయడంతోపాటు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ను తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు.