విద్యుత్ సవరణ చట్టంపై సలహాలు, సూచనలు ఇవ్వకుండానే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా తీర్మానం చేయడమేంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. విద్యుత్ సవరణ చట్టంతో ఉద్యోగాలు పోతాయని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పాడని దుయ్యబట్టారు. లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్.. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎక్కడికక్కడ అడ్డుకొని నిలదీస్తామని జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.
రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తాడో లేదో కేసీఆర్ స్పష్టం చేయాలని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రైతుల మీద కేసీఆర్‌కు ప్రేమే ఉంటే డిస్కమ్‌లకు ఎందుకు బకాయిలు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ముందు జీఎస్టీని వ్యతిరేకించిన కేసీఆర్.. తరువాత దిల్లీకి వెళ్లి మోదీకి వత్తాసు పలికారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు లేని ఇబ్బంది తెలంగాణకు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పాతబస్తీలో విద్యుత్ చౌర్యంకు పాల్పడుతుంటే ఎందుకు ఒక్కసారి వెళ్లి పరిశీలించలేదని సంజయ్ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: దేశానికి మోదీ సేవలు ఎంతో అవసరం: బండి సంజయ్