రాజకీయాలు పక్కనపెట్టి కరోనా కట్టడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హితవు పలికారు. రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఉందని ఆయన అన్నారు. ఆ విషయం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని ఆరోపించారు. ఆక్సిజన్ కొరతతో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడిందని.. లక్షల రూపాయలు ఖర్చు చేసినా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించే పరిస్థితి లేదని బండి విమర్శించారు.
మానవత్వంతో వ్యవహరించాలి..
రాష్ట్రంలో భారీగా కరోనా మరణాలు నమోదవుతున్నా.. ప్రభుత్వం సరైన లెక్కలు వెల్లడించడం లేదని బండి విమర్శించారు. కొవిడ్‌పై సీఎం కేసీఆర్ సమీక్షించి జిల్లాలకు నిధులు కేటాయించడంతో పాటు.. ఆరోగ్య సిబ్బందిని పూర్తిస్థాయి ప్రాతిపదికన నియమించాలని డిమాండ్ చేశారు. రెమ్‌డెసివర్ కొరత తీర్చడం సహా వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి మానవత్వంతో వ్యవహరించాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: అ.ని.శా, విజిలెన్స్ చేతికి దేవరయంజాల్ భూముల విచారణ