BJP Nirudyoga March Against TSPSC Paper Leak Case: బీజేపీ రాష్ట్రంలో అందివచ్చిన ప్రతిఅవకాశాన్ని అందిపుచ్చుకుంటూ కేసీఆర్ సర్కారు వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతోంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీపై వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీని పెద్దఎత్తున నిరసన ప్రదర్శలు చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ పార్టీ జాతీయ అధినాయకత్వం సూచనతో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని కమలనాధులు నిర్ణయించారు.
ఇప్పటికే ప్రశ్నాపత్రం లీకేజీపై వివిధరూపాల్లో బీజేపీ రాష్ట్రనాయకత్వం ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇది ఎన్నికల ఏడాది కావడంతో మరింత దూకుడుగా ముందుకుసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూనే.. పార్టీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇస్తూ వస్తోంది. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌లైన్‌ను కేసీఆర్ సర్కారు పూర్తిగా విస్మరించిందంటూ.. పెద్ధఎత్తున ప్రచారం చేస్తున్న కమలనాధులు.. అధికారంలోకి వస్తే ఆ ట్యాగ్‌లైన్‌ను అమలుచేస్తామని హామీ ఇస్తోంది.
ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై ఇప్పటికే.. గన్‌పార్కు, అమరవీరుల స్థూపం వద్ధ నిరసన దీక్ష, ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ధ నిరుద్యోగ మహాధర్నాను చేపట్టిన కమలదళం.. నిరుద్యోగ మార్చ్‌కు సిద్ధమైంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన మిలియన్ మార్చ్ స్ఫూర్తితో.. నిరుద్యోగ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 2నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ మార్చ్‌చేపట్టనున్నట్లు వెల్లడించింది.
రాష్ట్రంలోని ఉమ్మడి పదిజిల్లాల్లో ఏప్రిల్ 6 వరకు నిరుద్యోగ మార్చ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులోభాగంగా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి.. విద్యార్థులను చైతన్యవంతం చేసి నిరుద్యోగ మార్చ్ భాగస్వాముల్ని చేసేందుకు కాషాయదళం ప్రణాళికలు రచిస్తోంది. మంత్రివర్గం నుంచి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయడం సహా ప్రశ్నపత్రం లీకేజీపై సిట్టింగ్‌జడ్జితో విచారణ,.. నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష పరిహారం చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటాలు జరపాలని నిర్ణయించింది.
బీఆర్ఎస్ సర్కారును ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు. ప్రశ్నపత్రం లీకేజీ ఆందోళనలో ఆరెస్టైన బీజేపీ యువ మోర్చా నేతలను చంచల్‌గూడ జైలులో కిషన్‌రెడ్డి పరామర్శించారు. నిరుద్యోగ మహాధర్నా, నిరుద్యోగ మార్చ్ తరహాలో రాష్ట్రస్థాయిలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇవీ చదవండి: