Etela Fires on CM KCR: దేశం అధోగతి పాలవుతోందని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి వెల్లడించిన బాధనే.. తాము తెలంగాణలో అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. లక్షలాది మంది ఉద్యమంలో పాల్గొని, వేల మంది ప్రాణాలు అర్పిస్తే ఏర్పడిన రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైందని ఆక్షేపించారు. కేసీఆర్ తానే ఒక రాజు, చక్రవర్తిలా రాజ్యాన్ని ఏలుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఉన్న నలుగురు శాసనసభ్యులు ఏ విధంగా ఆణిముత్యాలు అవుతారని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఈటల పేర్కొన్నారు. కాంగ్రెస్, తెదేపా, సీపీఐ నుంచి ఏ పేరుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ప్రశ్నించారు. 2018లో 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. కనీస మానవత్వం లేకుండా కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు అభివృద్ధి జరగదని బెదిరింపులకు గురి చేస్తోంది నిజం కాదా అని నిలదీశారు. 8 ఏళ్లలో మీరెలా ప్రతిపక్షాలను పడగొట్టి.. చెడగొట్టారో తామూ దేశంలో ఉన్న అన్ని కోర్టులకు, మేధావులకు డేటా పంపిస్తామని హెచ్చరించారు. మునుగోడులో నైతికంగా కేసీఆర్ ఓడిపోయారని.. ఆ గడ్డమీద గెలిచేది రాజగోపాల్ రెడ్డి అని ధీమా వ్యక్తం చేశారు.
"సీఎం కేసీఆర్ దేశం అధోగతి పాలవుతుందని మాట్లాడుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. సీఎం వెల్లడించిన బాధనే మేము తెలంగాణలో అనుభవిస్తున్నాం. కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయి, అపహాస్యానికి గురైంది. మీ నలుగురు ఎమ్మెల్యేలు ఏ విధంగా ఆణిముత్యాలు అవుతారో రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు."
- ఈటల రాజేందర్, భాజపా ఎమ్మెల్యే
ఇవీ చూడండి..
అదే నిజమైతే.. కేసీఆర్ గుడికి వెళ్లి ప్రతిజ్ఞ చేయ్: తరుణ్ చుగ్