అభివృద్ధి గురించి కేంద్రం ఏం చేసిందో చెప్పలేక విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. మల్లేపల్లితో పాటు రెడ్‌హిల్స్‌లో ఎంఐఎం అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.
కేంద్ర హోంమంత్రి కొత్తగా హైదరాబాదులో 40వేల మంది రోహింగ్యాలు ఉన్నారని కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు. హోంమంత్రిగా ఉండి విచారణ జరిపి ఎన్నికల్లోగా ఎంతమంది ఉన్నారో లెక్కలు తేల్చాలని సవాలు విసిరారు. రోహింగ్యాల పేరుతో హిందూ ముస్లింల మధ్య అగాధం పెంచేందుకు కేంద్ర హోం మంత్రి ప్రయత్నిస్తున్నట్లుగా ఉందన్నారు.
ఓటర్ లిస్టులు ఎవరు తయారు చేస్తారో ఆ మంత్రి తెలుసుకోవాల్సిన అవసరం లేదా. రోహింగ్యాలు లేరని మేము వకాల్తా పుచ్చుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి ఆదేశాల మేరకే ఉంటున్నారనే విషయం తెలియదా. ఇప్పుడు కొత్తగా ఎంఐఎంతో తెరాసకు పొత్తు లేదని ఆ పార్టీ వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా ఉంది. మేము ఎప్పుడూ పొత్తు కోసం వెంపర్లాడలేదు. మాకు కూడా మీతో అవసరం లేదు.
-అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధినేత
ఇదీ చదవండి : జీహెచ్ఎంసీ బరిలో 1,121 మంది అభ్యర్థులు