Bhatti allegations on police: రాష్ట్రంలో శాంతి, భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని తెలంగాణ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. భట్టి నేతృత్వంలోని సీఎల్పీ బృందం... రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైని కలిసింది. పోలీసు వ్యవస్థ, శాంతి భద్రతలుపై సమీక్షించాలని కోరింది. అంతేకాకుండా కొత్తగూడెం కుటుంబం ఆత్మహత్య, మంథనిలో న్యాయవాదుల హత్య తదితర అంశాలను గవర్నర్ గుర్తు చేశామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందింది. పోలీసుల పనులను తెరాస నేతలు చేయనివ్వడం లేదు. వనమా రాఘవ దాష్టీకం- రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, మంథనిలో అడ్వకేట్ హత్య, శీలం రంగయ్య ఘటనలు గవర్నర్కు గుర్తు చేశాం.
-భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
అధికార పార్టీ నేతలు పోలీసులను పని చేయనివ్వడం లేదని భట్టి ఆరోపించారు. పోలీసు శాఖపై సమీక్ష చేసి... పోలీసులు పోలీసులుగా వ్యవహరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పోలీసుల నుంచి రక్షణ ఉంటుందనే భావన ప్రజలు కోల్పోయారని పేర్కొన్నారు. తెరాస నాయకులు చెప్తేనే పోలీసు దగ్గర న్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాంగం ప్రకారం పోలీసులు తమ విధులు నిర్వహించాలని... అధికార నాయకుల ఒత్తిళ్లకు లొంగవద్దని కోరారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పోలీస్ శాఖపై గవర్నర్ సమీక్ష చేయాలని కోరాం. పోలీసుల నుంచి రక్షణ ఉంటది అనే భావన ప్రజలు కోల్పోయారు. తెరాస నాయకులు చెప్తేనే పోలీసుల దగ్గర న్యాయం జరుగుతుంది.రాజ్యాంగం ప్రకారం పోలీస్ తన విధులు తను విధించాలి. ఒత్తిళ్లకు లొంగొద్దు.
-భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గవర్నర్ను కలిసిన చినజీయర్.. సమారోహ ఉత్సవాలకు రావాలని ఆహ్వానం