కరోనా సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ఆ వైరస్ రాకతో పల్లెల నుంచి పట్టణాల వరకు అతలాకుతలమయ్యాయి. అది నేర్పిన పాఠాలు మరెన్నో కళ్లముందు ఆవిష్కృతమయ్యాయి. అనేక కుటుంబాలు వీధిన పడ్డాయి. చివరికి మందు బాబుల మనసును కూడా మార్చేసింది. మద్యపాన అలవాట్లను తల్లకిందులు చేసింది. చాలా వరకు మద్యం ప్రియులు చల్లని బీరును వదలి క్రమంగా లిక్కర్‌వైపునకు మళ్లుతున్నారు. చల్లటి బీరుతో కరోనా వైరస్ త్వరగా వ్యాపిస్తుందనే అపోహ వల్ల మద్యం అమ్మకాల్లో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని భావిస్తున్నారు.
రాష్ట్రంలో మొదటి నుంచీ లిక్కర్ కంటే కూడా బీరు అధికంగా అమ్ముడుపోతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఎక్కువగా బీరుకు డిమాండ్ ఉంటుంది. ఇక వేసవిలో అయితే చెప్పక్కర్లేదు. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నాలుగు నెలల్లోనే అత్యధికంగా బీరు అమ్మకాలు జరుగుతాయి. బీరు తీసుకోవడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయని, శారీరక ఉపశమనం లభిస్తుందని బీరు తాగేవారి నమ్మకం.
మూడింట రెండొంతులు ఇక్కడే..
ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఐటీ, ఫార్మా కంపెనీలు, ఇతర వ్యాపార సంబంధ సంస్థలు ఉండటంతో లక్షల సంఖ్యలో ఉద్యోగులు పని చేస్తున్నారు. దీంతోపాటు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కావడంతో అవసరాల నిమిత్తం వచ్చిపోయే వారి సంఖ్యా లక్షల్లోనే ఉంటుంది. ఫలితంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే మూడింట రెండొంతులు బీరు అమ్మకాలు ఇక్కడే ఉంటాయని ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు.
2019-20 ఆర్థిక ఏడాదిలో.. 4.92 కోట్ల కేసుల బీరు అమ్మకాలు జరగ్గా.. నెలకు సగటున 41.02 లక్షల కేసులు అమ్ముడుపోయింది. అదే గత ఆర్థిక ఏడాదిలో కేవలం 2.73 కోట్ల కేసులు మాత్రమే బీరు విక్రయాలు జరగ్గా.. నెలకు సగటున 22.77 లక్షల కేసులు అమ్ముడుపోయాయి. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నెలలో బీరు 26.21 లక్షల కేసులు, మే నెలలో 20.19 లక్షల కేసులు అమ్మకాలు జరిగాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 20.79 లక్షల కేసులు అమ్ముడు పోయినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
ఎగుమతి చేసుకునే వెసులుబాటు..
ప్రస్తుత పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ఇతర రాష్ట్రాలకు 50 శాతం ఎగుమతి చేసుకోడానికి వెసులుబాటు కల్పించినట్లు అసోసియేషన్ తెలిపింది. అన్ని బ్రాండ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం కుదరదని.. ఆయా రాష్ట్రాల్లో డిమాండ్ కలిగిన కొన్ని బ్రాండ్లను మాత్రమే ఎగుమతి చేస్తున్నట్లు పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మాదిరి బీరు విక్రయాలు జరగాలంటే కనీసం ఏడాది పడుతుందని అంచనా వేస్తున్నట్లు ఆబ్కారీ అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: Webinar:ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ప్రజాద్రోహానికి ఒడిగట్టారు