రాష్ట్ర రాజధానిలో కరోనా కేసులు సంఖ్య నానాటికీ పెరుగుతోంది. బాధితుల సంఖ్య 10 వేలు దాటింది. గాంధీ తదితర ప్రభుత్వ ఆసుపత్రుల్లో పది వేలకు పైగా పడకలున్నాయి. గాంధీలో మరో వెయ్యి మంది చేరేందుకు అవకాశం ఉంది. కింగ్‌కోఠి, ఫీవర్, ఛాతీ తదితర వైద్యశాలల్లోనూ పడకలు ఖాళీగానే ఉన్నాయి.
మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులు
నగరంలో 25 పెద్ద ప్రైవేటు ఆసుపత్రులతోపాటు కొన్ని చిన్నవి కలుపుకొంటే కరోనా రోగుల కోసం 2500-3000 వరకు పడకలున్నాయి. ఇవన్నీ దాదాపు నిండిపోయాయి. వీటిల్లో 200 వెంటిలేటర్స్ పడకలు ఉన్నాయి.
ఇంతకు మించి బాధితుల వస్తే చేర్చుకోలేని పరిస్థితి. పోనీ పడకలు పెంచుదామంటే సరిపడా వైద్యులు, సిబ్బంది లేరు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు దొరక్క చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల సిఫారసులు తీసుకొస్తున్నారు. దీన్ని భరించలేక కొన్ని వైద్యశాలలు నిరీక్షణ(వెయిటింగ్) జాబితాను రూపొందించాయి. పడకలు ఖాళీ అయితే, కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిని చేర్చుకొనేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
క్వారంటైన్‌లో వైద్యం అందక ఆందోళన
కొవిడ్ బాధితులతో కలిసిమెలిసి ఉన్న వేలాది మంది హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఇలాంటి వారికి వైద్య ఆరోగ్య శాఖ వైద్యుల నుంచి ఫోన్ వైద్యం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ బస్ భవన్ ప్రాంతంలో ఉండే కుటుంబంలో మూడు రోజుల కిందట ముగ్గురికి కరోనా సోకింది. శుక్రవారం ఒకరు కన్నుమూశారు. శనివారం మిగిలిన ఇద్దరూ నాలుగు ప్రైవేటు ఆసుపత్రులు తిరిగినా పడకలు దొరకలేదు. గాంధీ ఆసుపత్రికి వెళ్లేందుకు వీరు విముఖత చూపారు.
పీపీఈ కిట్స్‌లో ఉన్న వీరు శనివారం రాత్రంతా ఆందోళనగా గడిపారు. ఇలా వందల మంది కొవిడ్ బాధితులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే అదనుగా కొన్ని ఆసుపత్రులు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
బాధితులకు పూర్తి సేవలు అందిస్తున్నాం
ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరిన వారికి పూర్తిస్థాయి వైద్యం అందిస్తున్నాం. లక్షణాలు తీవ్రంగా ఉంటేనే చేర్చుకుంటున్నాం. మిగిలిన వారిని ఇళ్లలో ఉండమని సూచిస్తున్నాం. వ్యాధి తీవ్రతను బట్టి బాధితుల జాబితాను రూపొందించి అవసరమైన వారిని చేర్చుకుని ప్రాణాలను నిలబెడుతున్నాం. వెంటిలేటర్లు తక్కువగా ఉండటం వల్లే కొన్నిసార్లు కొంతమందిని చేర్చుకోవడంలేదు.
- బొలినేని భాస్కర్‌రావు, ప్రైవేటు ఆస్పత్రుల సంఘం ముఖ్య ప్రతినిధి
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో మరోసారి లాక్డౌన్..!