యాదాద్రి ప్రధానాలయంలో సున్నం మరకలు చెడిపి చదును చేసే పనులను కూలీలు చేపట్టారు. శిల్పాలు అతుక్కోవడానికి వేసిన డంగు సున్నం వర్షాలకు తడిసి జారిపోవడంతో శిలలపై తెల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. ఈవిషయాన్ని ఇటీవల సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి గమనించి వెంటనే వాటిని శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేక యంత్రాల ద్వారా మచ్చలను తొలగించి.. సుందరంగా తీర్చిదిద్దేందుకు పనులు జరుగుతున్నాయి.
శివాలయానికి టేకు తలుపులు
యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధిలో భాగంగా శ్రీపర్వతవర్దిని రామలింగేశ్వర స్వామి ఆలయానికి టేకు కలపతో రూపొందించిన ద్వారాలు యాదాద్రికి చేరుకున్నాయి. సికింద్రాబాద్‌లోని అన్నపూర్ణ టింబర్ డిపోలో ఆధ్యాత్మికత రూపాలతో సిద్ధపరచిన తలుపులను బిగించే పనులు చేపట్టారు. వీటిపై శైవాగమ చిహ్నాలను పొందుపరిచారు. పునర్నిర్మితమైన రామలింగేశ్వరుడు ఆలయానికి 12 అడుగుల ఎత్తులో నగిశీలతో రూపొందించిన ఈ ద్వారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
స్థానాచార్యుల రాజీనామా ఆమోదం
యాదాద్రి ఆలయ స్థానాచార్యులుగా ఉన్న సందుగుల రాఘవాచార్య రాజీనామాను దేవస్థానం ఈఓ గీతారెడ్డి ఆమోదించారు. గత నెలలో పలు వ్యక్తిగత కారణాలతో స్థానాచార్యులు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన రాజీనామాను వెనక్కి తీసుకుని విధుల్లోకి రావాలని నెల సమయం ఇచ్చినా ఆయన నుంచి స్పందన రాకపోవడంతో రాజీనామాను ఆమోదించినట్లు ఆలయ ఈఓ తెలిపారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపినట్లు తెలిపారు.