Bandi Sanjay Fires on KCR : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తెలంగాణలో.. అపార ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 20 మంది చనిపోయారని.. మరో 25 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు. ఇంతవరకు వారి ఆచూకీ లేదని వివరించారు. వేలాది సంఖ్యలో పశువులు చనిపోయాయని.. వేలాది ఇండ్లు మునిగిపోయాయని బండి సంజయ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
లక్షల ఎకరాల్లో పంట, ఆస్తి నష్టం జరిగిందని బండి సంజయ్ తెలిపారు. రోడ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వరదలవల్ల మరణాలు సంభవించాయే తప్ప.. భారీ వర్షాల కారణంగా ఇంత పెద్ద సంఖ్యలో ఎన్నడూ చనిపోయిన దాఖలాలు లేవని అన్నారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ చేసినప్పటికీ.. రాష్ట్ర సర్కార్ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని బండి సంజయ్ విమర్శించారు.
Bandi Sanjay Fires on Telangana Government : ఈ క్రమంలోనే ముంపు బాధిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి.. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో తెలంగాణ సర్కార్ పూర్తిగా విఫలమయిందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ముందే మేల్కొని ఉంటే వీటిని నివారించే అవకాశం ఉండేదని చెప్పారు. కేంద్ర ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగేవరకు.. రాష్ట్ర బృందాలు ముంపు ప్రాంతాల్లోకి వెళ్లలేకపోయాయని చెప్పారు. రాష్ట్ర అధికారులు కష్టపడుతున్నా.. ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందకపోవడంతో.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వారు ఉన్నారని బండి సంజయ్ వెల్లడించారు.
Bandi Sanjay on Telangana Rains :ఇప్పటికీ అనేక జిల్లాల ప్రజలు భారీ వర్షాలతో అల్లాడుతున్నారని బండి సంజయ్ తెలిపారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించరానిదని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర సర్కార్ యుద్ద ప్రాతిపదికన.. సహాయ పునరావాస చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.20 లక్షలు, ఇండ్లు కోల్పోయిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలంతా ముంపు బాధిత ప్రాంతాల్లో పర్యటించి.. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఎల్లుండి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ముంపు బాధిత ప్రాంతాల్లో తాను పర్యటించబోతున్నట్లు బండి సంజయ్ వివరించారు.
DK Aruna Fires on Telangana Government : మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల అనేక జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. వరంగల్‌లో 150 కాలనీలు నీటమునిగాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తే వరంగల్ ఎందుకు నీట మునిగిందని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో 40,000 కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డునపడ్డాయని వివరించారు. పంట నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని చెప్పారు. వర్షాలతో నష్టపోయిన జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించాలని అన్నారు. వరద ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని డీకే అరుణ పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి : Moosi River floods : సంగెం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న మూసీ నది.. రాకపోకలను నిలిపివేసిన పోలీసులు