Bandi Sanjay fires on MLC Kavitha Deeksha: రాష్ట్రంలో మహిళలు అభద్రతా భావంతో ఉన్నారని.. వారు బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవడానికి సీఎం కేసీఆర్ వ్యవహారశైలే కారణమని మండిపడ్డారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా గోస-బీజేపీ భరోసా పేరిట చేపట్టిన దీక్షను పార్టీ అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం దీక్షకు హాజరైన మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదు: కవిత మద్యం కుంభకోణంపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కవిత చేసిన దందాపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదన్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటేనని అర్థమవుతుందన్నారు. లిక్కర్ స్కామ్‌లో కవితకు సంబంధం ఉందా లేదా సీఎం, పీసీసీ అధ్యక్షుడు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కవిత లిక్కర్ స్కామ్‌కు, తెలంగాణ సమాజానికి సంబంధం లేదని.. తెలంగాణ సమాజానికి చెప్పి కవిత లిక్కర్ దందా చేసిందా అని ప్రశ్నించారు. ఉద్యమకారుల గురించి పట్టించుకోని కేసీఆర్.. తన కుటుంబానికి ఆపద వస్తే వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు.
దిల్లీలో కాదు.. ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలి: అవినీతిపరులు ఎవరైనా.. మోదీ సర్కార్ వదిలే ప్రసక్తే లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత దిల్లీలో కాదు.. ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలని బండి ఎద్దేవా చేశారు. సిగ్గు లేకుండా కేసీఆర్ కుమార్తె దిల్లీ పోయి దీక్ష చేస్తోందని మండిపడ్డారు. 33 శాతం బీఆర్ఎస్ టికెట్లు మహిళలకు ఇవ్వనందుకు తన తండ్రి కేసీఆర్‌ను కవిత ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కేబినెట్లో 33 శాతం మహిళా మంత్రులు ఎందుకు లేరని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో మహిళా సర్పంచ్‌కే రక్షణ లేకుంటే.. సామాన్యల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు.
'దేశంలో మహిళలపై వేధింపుల కేసుల్లో రెండో స్థానంలో తెలంగాణ ఉంది. ఎమ్మెల్సీ కవిత.. రాష్ట్ర మహిళలు తలదించుకునే దుస్థితి తెచ్చారు. లిక్కర్ స్కామ్‌లో రేవంత్‌కు ఏమైనా సంబంధం ఉందా ? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని స్పష్టమవుతోంది. లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయంపై కేసీఆర్ స్పష్టత ఇవ్వాలి. బీఆర్ఎస్, మజ్లిస్ జెండాలు చూస్తే మహిళలు భయపడుతున్నారు.'- బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
బండి సంజయ్‌కి జేపీ నడ్డా ఫోన్ : మహిళా గోస – బీజేపీ భరోసా దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అభినందించారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలను నిరసిస్తూ దీక్ష చేయడం గొప్ప విషయమని ఫోన్ చేసి అభినందించారు. తెలంగాణ మహిళలకు బీజేపీ జాతీయ నాయకత్వం అండగా ఉందనే భరోసా ఇవ్వాలని బండి, డీకేలకు సూచించారు. మహిళా సమస్యల పరిష్కారం కోసం మరింతగా పోరాడాలని నేతలకు తెలిపారు.
ఇవీ చదవండి: