Bandi sanjay fires on cm KCR: ప్రజా సంగ్రామ యాత్ర కోసం నిర్మల్ వెళ్తున్న తనను అడ్డుకోవడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భైంసాలో నిర్వహించే సభకు ఇవాళ కచ్చితంగా వెళ్లి తీరుతానని తేల్చి చెప్పారు. అవసరమైతే న్యాయస్థానం తలుపులు తడతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలనకు ఇదే నిదర్శనమని ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్ధంగా పాదయాత్రకు వెళ్తుంటే అడ్డుకుంటారా? అని ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పాదయాత్రకు తొలుత అనుమతిచ్చి ఇప్పుడు హఠాత్తుగా రద్దు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ రాకకోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని, రూట్ మ్యాప్ ప్రకటించిన తర్వాత ఇలాంటి నిర్ణయాలేంటని మండిపడ్డారు.
‘‘భైంసా సున్నిత ప్రాంతం అంటున్నారు. ఇదేమైనా నిషేధిత ప్రాంతమా? అక్కడికి ఎందుకు వెళ్లకూడదు?. ప్రస్తుతం తిరిగి కరీంనగర్‌కు వెళ్తున్నాను. సోమవారం మధ్యాహ్నం వరకు సమయం ఉంది. అప్పటిదాకా వేచి చూస్తాను. పాదయాత్రకు తొలుత అనుమతిచ్చారు. ఇప్పుడు ఇలా రద్దు చేయడం ఏంటి." -బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
అంతకుముందు ప్రజా సంగ్రామ యాత్ర కోసం కరీంనగర్ నుంచి నిర్మల్ వెళ్తున్న బండి సంజయ్‌ను జగిత్యాల మండలంలోని తాటిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసేందుకు యత్నించారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకున్న సంజయ్.. కార్యకర్తల వాహనంలో కోరుట్ల వైపు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ కార్యకర్తలు అందోళనకు దిగారు.
"నిర్మల్‌లో బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు కొట్టుకుంటూ అరెస్టు చేస్తున్నారు. ఎస్పీని కలవడానికి వెళ్తున్నవారిని దారుణంగా కొడుతున్నారు. అరెస్టు చేసిన కార్యకర్తలను త్వరగా విడుదల చేయాలి. మీరు రెచ్చగొట్టినా మేం సంయమనంతో ఉన్నాము. మా సంయమనాన్ని చేతగానితనంగా భావించొద్దు." - బండి సంజయ్
పాదయాత్ర చేస్తే భయమెందుకు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టదలచిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడం సీఎం పిరికి చర్యలకు నిదర్శనమని ఆ పార్టీ నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడటాన్ని ఓర్వలేక ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. బండి పాదయాత్ర చేస్తే భయమెందుకని ఆమె అన్నారు. టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలన్నీ బయటపడతాయనే ఉద్దేశంతోనే పాదయాత్రను అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
అనుమతి రద్దు వెనుక సీఎం ప్రోద్బలం: బండి సంజయ్‌ను నిర్మల్ రాకుండా అడ్డుకోవడం దారుణమని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. భైంసా సభకు ముందు అనుమతిచ్చి ఇప్పుడు రద్దు చేయడమేంటని ఎంపీ ప్రశ్నించారు. అనుమతి రద్దు చేయడం వెనుక సీఎం కేసీఆర్ ప్రోద్బలం ఉందని మండిపడ్డారు. న్యాయస్థానం అనుమతి తీసుకుని యాత్ర కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: