Bandi Sanjay On Cm Kcr: సీఎం కేసీఆర్ నిర్ణయం పూర్తిగా భాజపా విజయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భాజపా పోరాటం వల్లే ధాన్యం కొనాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈ మేరకు నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొను లేదంటే గద్దె దిగు..అని గట్టిగా చెప్పినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. భాజపా పెట్టిన పొగ వల్లే ధాన్యం కొంటామని సీఎం ప్రకటించారని వెల్లడించారు.
'వరి వేస్తే ఉరే.. అన్న సీఎంతో ధాన‌్యం కొంటామని చెప్పేలా చేశాం. ధాన్యం కొనిపిచ్చే బాధ్యత మాదే అని చెప్పాం. చేసి చూపించాం. రైతుల్లో వ్యతిరేకత పెరుగుతోందని తెలిసి ధాన్యం కొనేందుకు దిగివచ్చారు. సీఎం ఈ నిర్ణయం కొంచెం ముందే తీసుకుని ఉంటే బాగుండేది. ఇప్పటికే కొందరు రైతులు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోయారు. ఇప్పటికే అమ్ముకుని నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి.' -- బండి సంజయ్
ఇప్పటి వరకు తెలంగాణ కోసం కేంద్రం 97 వేల కోట్లు ఖర్చు చేసిందని బండి సంజయ్ చెప్పారు. 1960 కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కేసీఆర్ నిర్వాకం వల్ల గత రెండు మూడు రోజులుగా అమ్ముకున్న రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దిల్లీలో కేసీఆర్ గంట సేపు కూడా దీక్షలో కూర్చోలేదని విమర్శించారు. అసలు దీక్ష ఎందుకు చేశారో అర్థం కాలేదన్నారు.
కరెంటు ఛార్జీలు ఎప్పుడూ తగ్గిస్తారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. బస్సు ఛార్జీలు ఇష్టానుసారంగా పెంచి సామాన్య ప్రజలపై భారం మోపారన్నారు. వ్యవసాయమే లేని తనకు రైతు బీమా ఎట్లా వస్తుందో తెరాస నేతలు చెప్పాలని ప్రశ్నించారు. శ్రీరామనవమి, హనుమాన్ యాత్రలు జరుపుకుంటే మతతత్వం.. రంజాన్ ర్యాలీలు తీస్తే సెక్యులరిజమా అన్నారు. కేసీఆర్, కేటీఆర్, బంధువులకు ఫామ్ హౌస్లు ఉన్నాయి కాబట్టే 111జీవోను రద్దు చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది: కేసీఆర్
CM KCR On 111 GO: 'న్యాయపరమైన చిక్కులు తొలగించి జీవో 111 ఎత్తివేస్తాం'