Bandi Sanjay and Revanthreddy on CS Resign: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పును శిరసావహించి... సోమేశ్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ బాధ్యతల నుంచి తప్పించి... ఏపీకి బదిలీ చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకుని సోమేష్‌కుమార్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.
సోమేశ్‌కుమార్‌ని నియమించి కేసీఆర్ రాజకీయలబ్ధి పొందారు : సీఎస్ సోమేశ్‌కుమార్‌ను తక్షణమే పదవికి రాజీనామా చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును శిరసావహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను బాధ్యతల నుంచి తప్పించాలన్నారు. 2014 రాష్ట్ర విభజన తరువాత డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికం, అప్రజాస్వామికం అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన అనేక మంది అధికారులు సీనియారిటీ లిస్టులో ఉండగా... ఏపీకి కేటాయించబడిన సోమేశ్‌కుమార్‌ను సీఎస్‌గా నియమించి కేసీఆర్ రాజకీయలబ్ధి పొందారని ఆరోపించారు. తెలంగాణ వ్యక్తిని లేదా తెలంగాణకు కేటాయించిన వ్యక్తిని సీఎస్‌గా నియమించాలని కోరారు.
రాజకీయ అవసరాల కోసం అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి కేసీఆర్ అధికారులను పావుగా వాడుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని బండి సంజయ్ దుయ్యట్టారు. 317 జీవో సహా అనేక ఉద్యోగ, ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను సోమేశ్ కుమార్ ద్వారా విడుదల చేయించారని ఆరోపించారు. హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్, హోం తదితర శాఖల్లో తమకు అనుకూలమైన అధికారులను నియమించుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేందుకు సోమేశ్ కుమార్‌ను పావుగా వాడుకున్నారన్నారు. సీఎస్ నియామకం విషయంలో కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండగా చీఫ్ సెక్రటరీగా నియమించడం కేసీఆర్ అనైతిక రాజకీయాలకు నిదర్శనం అన్నారు. ఈ విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒక న్యాయం.. సోమేశ్ కుమార్‌కు ఒక న్యాయమా అని ప్రశ్నించారు.
సీబీఐతో విచారణ జరిపించాలి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ నియామకం అక్రమమని తాము మొదటి నుంచే చెబుతున్నామని... తాజాగా హైకోర్టు కూడా అదే చెప్పిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎస్ విషయంలో హైకోర్టు తీర్పుపై ట్విట్టర్ వేదికగా స్పందించిన అయన... ధరణి, సీసీఎస్‌ఎల్, రెరా సంస్థకు హెడ్‌గా సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా ఇక్కడి వారికీ అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఆయనకు అనుకూలంగా పని చేసిన వారికే పోస్టింగ్‌లు ఇస్తున్నారని ఆరోపించారు.
తాము మొదటి నుంచి ప్రధాన కార్యదర్శిగా సోమేశ్‌కుమార్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, వి.హనుమంతురావు, కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డిలు పేర్కొన్నారు. టాప్ 15 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా బిహార్‌కి చెందిన వారే ఉన్నారని ఆరోపించారు. రేపు, ఎల్లుండి నూతన ఇంచార్జి మానిక్ రావు థాక్రే హైదరాబాద్‌లో ఉంటారని.. పార్టీ నాయకులతో వరుస సమావేశాలు ఉంటాయన్నారు. పీఏసీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, డీసీసీ నేతలు, వివిధ కమిటీలతో సమావేశం అవుతారన్నారు. రెండో రోజున అనుబంధ సంఘాల నేతలతో సమావేశం అవుతారని వివరించారు.
ఇవీ చదవండి: