Telangana Badi Bata Schedule 2023 : చదువుకు దూరమైన పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంతో పాటు... సర్కారు బడుల్లో విద్యార్థులను పెంచేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. జూన్ 3 నుంచి జూన్ 17వ తేదీ వరకు పండగ వాతావరణం ప్రతిబింబించేలా ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. బడిబాట లక్ష్యాలు, నిర్వహణ తీరుపై విధివిధానాలు వివరిస్తూ డీఈఓలకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులు పంపించారు.
Badi Bata Schedule in Telangana 2023 : ఈనెల 31లోగా జిల్లా కలెక్టర్లు బడిబాట సమన్వయ సమావేశాలు నిర్వహించి కార్యక్రమాలను ప్రణాళిక చేస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను ఈ సమావేశాలకు ఆహ్వానిస్తారు. జూన్ 1న మండల, గ్రామస్థాయి సమావేశాలు జరుగుతాయి. జూన్ 3 నుంచి 9 వరకు ఉదయం 7 గంటల నుంచి 11 వరకు ప్రధానోపాద్యాయలు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీలు ఇంటింటికీ తిరిగి పిల్లలను, తల్లిదండ్రులను కలిసేలా ప్రణాళిక చేశారు. బాలకార్మికులు, ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి బడిలో చేర్పిస్తారు.
Badi Bata in Telangana 2023 : 'ప్రభుత్వ పాఠశాలల్లో సరిగ్గా చదువు చెప్పరని.. వసతులు ఉండవు' అన్న భావనను తొలగించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏవిధంగా అవగాహన కల్పించాలన్న దానిపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ తరగతులు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాలు, రెండు జతల యూనిఫాం ఇస్తున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. పాఠశాల ప్రత్యేకతలు, సాధించిన విజయాలను వివరిస్తూ కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయనున్నారు.
పాఠశాలలో సదుపాయల పట్ల అవగాహన : బడులు తెరిచాక జూన్ 12 నుంచి 17 వరకు వివిధ కార్యక్రమాలకు ప్రణాళిక చేశారు. జూన్ 12న మన ఊరు - మన బడి, మన బస్తీ - మన బడి పేరిట కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలకు రంగులు వేసి పండగ వాతావణం కల్పించి బడుల్లో పెరిగిన సదుపాయాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. జూన్ 8న తొలిమెట్టు కార్యక్రమాన్ని తల్లిదండ్రులకు వివరిస్తారు.
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెరిగేలా పలు కార్యక్రమాలు చేస్తారు. తొలిమెట్టు ద్వారా విద్యార్థులు నేర్చుకునే సామర్థ్యాలను ఎలా పెరిగాయో, గతంలో ఇప్పటికీ తేడాలను వివరిస్తారు. జూన్ 14న పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం, బాలసభలు నిర్వహిస్తారు. జూన్ 16న బడుల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంలో బోధన సదుపాయాలు, రెండు భాషల్లో ముద్రించిన పాఠ్యపుస్తకాలపై తల్లిదండ్రుల్లో అవగాహన పెంచుతారు. జూన్ 17 బాలికల విద్యపై ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తారు.
విద్యార్థినులకు సలహాలు : ఇటీవల పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థిలను భవిష్యత్తు కెరీర్, ఉన్నత విద్యావకాశాలపై సలహాలు ఇస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలతో పాటు, ఎంసెట్లో మంచి ర్యాంకులు సాధించిన అమ్మాయిలను సత్కరిస్తారు. బాలికలకు ఉపకార వేతనాలు, కరాటే వంటి ఆత్మరక్షణ శిక్షణలు, రుతుస్రావానికి సంబంధించిన విషయాలపై చర్చిస్తారు.
ఇవీ చదవండి: