Ayodhya Ram Mandir Cyber Frauds : దేశం మొత్తం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఘట్టం అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మహత్తర కార్యక్రమాన్ని అదనుగా చేసుకుని కేటుగాళ్లు అమాయకుల జేబులు కాజేయాలని చూస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాల పేరిట ఆశ జూపుతూ, నకిలీ లింక్‌లు పంపిస్తున్నారు. నమ్మి వాటిని నొక్కామో ఇక అంతే సంగతులు. వ్యక్తిగత డేటాతో పాటు గల్లాపెట్ట కూడా గుళ్లయిపోవాల్సిందే. అందుకే అప్రమత్తత తప్పనిసరి అని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు.
Cyber Frauds in the Name of Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం, ప్రస్తుతం దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోన్న అంశం. ఈ విషయాన్ని గ్రహించిన సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయోధ్య రామమందిర కార్యక్రమాల పేరుతో వాట్సాప్ వేదికగా స్పామ్ నెంబర్ల నుంచి రామ్ జన్మభూమి గృహ్ సంపర్క్ అభియాన్ యాప్ లింకును పంపుతున్నారు.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజున వీఐపీ లాంజ్‌లో కూర్చుని చూడొచ్చని ఫేక్ యాప్‌లతో వల విసురుతున్నారు. వాటిని క్లిక్ చేయగానే వ్యక్తిగత డేటాతో పాటు బ్యాంక్ ఖాతా వివరాలు నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోవడం, భయంకర వైరస్‌లు మన డివైజ్‌లోకి వచ్చేయడం అంతా చకచకా జరిగిపోతుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా 3 నెలల వ్యాలిడిటీతో రూ.749 విలువ చేసే రీఛార్జ్ చేస్తున్నారని నకిలీ లింక్‌లు కూడా వాట్సాప్ వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ లింకులు అన్నీ కూడా చూడగానే ఆసక్తిని రేకెత్తించేలా, నిజమే అని నమ్మేలా ఆకర్షణీయంగా ఉండటంతో ప్రజలు వీటి బారిన పడే అవకాశం ఉంది. ఏదైనా తెలియని లింక్ వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించి నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతే క్లిక్ చేయాలనేది సైబర్ నిపుణుల సూచన.
వారి ముచ్చట్లు విన్నారా - మీ ఖాతా ఖాళీ అయినట్లే
ఇదిలా ఉండగా, ఈ నెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న రామ మందిరానికి ఆహ్వాన పత్రిక ఉన్న వారికే అనుమతి ఉంటుందని, ఆహ్వానం లేని వారిని అనుమతించడం లేదని ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. దేశ ప్రధాని సహా కేంద్రమంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ముఖ్య నేతలు హాజరవుతోన్న దృష్ట్యా భారీ పోలీస్ బందోబస్తును యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, అల్లర్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో మహత్కార్యాన్ని పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది.
Customer care Fraud Hyderabad : ఛాన్స్ దొరికితే చాలు.. లూటీ చేసేస్తున్నారు