నాలుగు నెలల కిందటితో పోల్చితే ఇప్పుడు కొవిడ్ కేసులు (Corona Cases) తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రజల్లో ఉదాసీనత ఏర్పడింది. మాస్కులు ధరించే వారి సంఖ్య 20 శాతం మాత్రమేనని వైద్యశాఖ వెల్లడిస్తోంది. ఈ క్రమంలోనే టీకాలు పొందే వారి సంఖ్య కూడా తగ్గింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3 కోట్ల మందికి కరోనా టీకాలు (Corona Vaccine) వేయగా, ఇందులో 76 శాతం మంది మొదటి డోసు, 30 శాతం మంది రెండోడోసు తీసుకున్నారు. రెండో డోసుకు గడువు దాటిపోవడంతో చాలా మంది ముందుకు రావడం లేదని వైద్యశాఖ గుర్తించింది.
పంచాయతీల భాగస్వామ్యంతో..
రెండో డోసుకు అర్హులైన వారిపై ప్రధానంగా దృష్టి పెట్టాం. వీరికి టీకా (Corona Vaccine) వేసేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా గ్రామ పంచాయతీలను భాగస్వాములుగా చేశాం. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు. వచ్చే నెలాఖరుకు రాష్ట్రంలో 90 శాతం మందికి తొలిడోసు అందించేలా ప్రణాళిక అమలు చేస్తున్నాం.
- డాక్టర్ జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు
ఆర్నెల్లలోపు తప్పనిసరి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గనిర్దేశాల ప్రకారం.. నిర్ణీత కాలవ్యవధిలో రెండు డోసులూ (Corona Vaccine) స్వీకరిస్తేనే కొవిడ్ (Corona Virus) నుంచి రక్షణ లభిస్తుంది. ఉదాహరణకు కొవిషీల్డ్‌ను నాలుగు వారాల వ్యవధిలో రెండు డోసులు వేసుకుంటే.. దాని సామర్థ్యం 66.7 శాతంగా నమోదైంది. 4-8 వారాల వ్యవధిలో స్వీకరిస్తే 56.42 శాతం.. 9-12 వారాల వ్యవధిలో తీసుకుంటే 70.48 శాతం.. 12 వారాల తర్వాత పొందితే 77.62 శాతం సమర్థత ఉన్నట్లుగా వెల్లడైంది. ఆలస్యం వల్ల టి కణాల ఆధారిత రోగ నిరోధక వ్యవస్థ బలోపేతమవుతోందని తేలింది. వాస్తవానికి తొలి డోసు (Corona Vaccine) స్వీకరించిన 22 రోజులకు దాని పనితీరు మొదలవుతుంది. ఆ ప్రభావం ఆర్నెల్లలోగా తగ్గుతుంది కనుక, ఆ లోపు రెండో డోసు తీసుకోవాలని శాస్త్రీయంగా నిర్ధారించారు. కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం తొలిడోసు తర్వాత 71 శాతం వరకూ.. రెండు డోసులూ (Corona Vaccine) పొందాక 92 శాతానికి పైగా లభిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. తొలిడోసు తర్వాత కొవిడ్ సోకినా.. మూణ్నెల్ల తర్వాత రెండో డోసు తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: రెండు డోసులు తీసుకున్నారా..? అయితే ఈ 'ఫుడ్' ఆఫర్ మీకే!