గొలుసుకట్టు వ్యాపార సంస్థ ఈ-బిజ్ ఎండీ పవన్ మల్హాన్, అతని కుమారుడు హితిక్ మల్హాన్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ-బిజ్ సంస్థ సభ్యులుగా చేరి మోసపోయామంటూ ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుపై నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రైజ్ చిట్స్, మనీ సర్క్యులేషన్ 1978 చట్టప్రకారం కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.
దర్యాప్తులో ఒక్కొక్కటిగా..
2001 ఉత్తరప్రదేశ్లోని నోయిడా కేంద్రంగా ఏర్పాటయిన ఈ-బిజ్ సంస్థ గొలుసుకట్టు విధానంలో భాగంగా 17లక్షల మందిని సభ్యులుగా చేర్చుకొని వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా రూ.5వేల కోట్లకు పైగా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. పలు రాష్ట్రాల్లో ఈ-బిజ్ సంస్థపై కేసులున్నాయని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగ యువకులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. గొలుసుకట్టు విధానంలో సభ్యత్వం తీసుకోవద్దని... ఈ తరహా వ్యాపారంలో చివరి సభ్యులు నష్టపోవాల్సి వస్తుందని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు.
ఇదీ చూడండి: పరీక్ష రాసేందుకు వెళ్తే..ఐలవ్యూ చెప్పిన ఇన్విజిలేటర్