చోరీకి గురైన వాహనాలను పట్టుకున్నా... మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపినా పోలీసులు సదరు వాహనాలను స్వాధీనం చేసుకుంటారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపినా వాటిపైనా జరిమానాలు విధిస్తారు. జరిమానాలు చెల్లించకుండా తప్పించుకు తిరిగే వాళ్ల వాహనాలు కూడా పోలీసులు జప్తు చేస్తారు. పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 39 సీపీ చట్టం ప్రకారం ఈ తరహా వాహనాలను సీజ్ చేసే హక్కు పోలీసులకు ఉంటుంది. ఇలా పట్టుబడిన వాహనాలను ఆర్సీ బుక్కులోని వాహన యజమాని చిరునామా ఆధారంగా పోలీసులు నోటీసులు పంపిస్తారు. ఇలా మూడు నోటీసులు జారీ చేసినా యజమాని నుంచి ఎలాంటి స్పందన రాకపోతే పోలీసులు ఆ వాహనాలను వేలం వేయడానికి సిద్ధం చేస్తారు.
భయంతో...
మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్లపై పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారనే భయంతో చాలా మంది వాహనాలను వదిలేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతల విభాగం పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, సీసీఎస్ పోలీసులు సీజ్ చేసిన వాహనాలన్నింటిని సిటీ ట్రైనింగ్ సెంటర్ కు అప్పజెప్తున్నారు. ఇలా చేయడం వల్ల హైదరాబాద్ కమిషనరేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోయిన వాహనాల వివరాలన్నీ ఒకే చోట చేరే అవకాశం ఉంటుంది. ఈ వివరాలన్నింటిని ఆన్ లైన్ లో పొందుపర్చి సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రకటన ఇస్తున్నారు.
ధ్రువీకరణ పత్రాలుంటేనే...
వాహనాలను వేలం వేయనున్నామని... అభ్యంతరం ఉన్నవాళ్లు ఆర్నెళ్ల లోపు సరైన ధ్రువీకరణ పత్రాలు తీసుకొస్తే వాహనాన్ని వాళ్లకు అప్పజెప్తామని అధికారులు చెబుతున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనం చోరీకి గురైతే హబీబ్ నగర్ ఠాణాలో దొరికినా... యజమానికి ఆ విషయం తెలియక అలాగే మిన్నకుండి పోతారు. ఏడాదికో మారు సీటీసీ ఆధ్వర్యంలో ఠాణాల్లో ఉన్న వాహనాల వివరాలన్నీ ఆన్ లైన్ పెట్టడం వల్ల యజమాని ఒకవేళ తన వాహనం ఉంటే దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, యాజమాన్య పత్రాలు తీసుకెళ్తే పోలీసులు అప్పజెప్తారు. సీటీసీ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ ఇచ్చిన ఆర్నెళ్ల లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. లేకపోతే సదరు వాహనాన్ని వేలం వేస్తారు.
2015 నుంచి...
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వాహనాలను 2015 నుంచి ఇలా వేలం వేస్తూ వస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి గందరగోళానికి, అక్రమాలకు తావులేకుండా వేలం ప్రక్రియ సాఫీగా సాగిపోతోంది. గత నాలుగేళ్లలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 12 వేల వాహనాలను వేలం వేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 4 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.
ఇదే విధానం...
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనూ ఇదే విధానాన్ని అవలంబిస్తూ వాహనాలు వేలం వేస్తున్నారు. ఇటీవల సచివాలయంలోని వాహనాలను కూడా సీటీసీ ఆధ్వర్యంలో వేలం వేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని వాహనాలను ఇదే విధానంలో వేలం వేయాలని సోమేశ్ కుమార్ సంబంధిత శాఖలకు సూచించినట్లు సీటీసీ ప్రిన్సిపల్ మద్దిపాటి శ్రీనివాస్ రావు తెలిపారు.
3వేల వాహనాలు...
వాహనాల ధర నిర్ణయించే విషయంలోనూ రవాణా శాఖ అధికారులు సాయాన్ని తీసుకుంటున్నారు. కండీషన్ లో ఉన్న బండిని పూర్తిగా పరిశీలించి ఎంవీఐలు ధర నిర్ణయిస్తారు. ఒకవేళ వాహనం తుక్కుగా మారితే దాన్ని కిలో లెక్కన విక్రయించేలా ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనేరేట్ పరిధిలో దాదాపు 3వేల వాహనాలను వేలం వేయనున్నారు. ఇందులో 10 కార్లు, 50 ఆటోలు, మిగతావన్నీ ద్విచక్ర వాహనాలున్నాయి. వేలం ద్వారా పొందిన వాహనాలకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఓ లేఖను ఇస్తారు. ఆర్టీఏ కార్యాలయాల్లో మూడు నెలలలోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: రాజధానిలో నాలాల విస్తరణ.. సవాళ్లే అడుగడుగున!