తెలంగాణ రాష్ట్ర సమితికి కీలకంగా మారిన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, పట్టభద్ర ఎమ్మెల్సీల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు నూతనోత్సాహాన్ని ఇచ్చే లక్ష్యంతో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నల్గొండ జిల్లా హాలియాలో భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ శ్రేణులు, అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో సాగర్‌లో ఉప ఎన్నికలు జరగనుండగా.. ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు తెరాస పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే 13 ఎత్తిపోతల పథకాలు, వివిధ అభివృద్ధి పనులను మంజూరు చేసిన సీఎం.. తానే స్వయంగా ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.
హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో నాగార్జునసాగర్ చేరుకునే కేసీఆర్.. అక్కడ డ్యామ్‌ను పరిశీలించి, ఇంజినీర్లతో మాట్లాడతారు. ఆ తర్వాత నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు హాలియాలో నిర్వహించే తెరాస బహిరంగసభలో ప్రసంగిస్తారు.
కృతజ్ఞత సభగా..
ఉమ్మడి నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ ఆయకట్టు, నియోజకవర్గాల్లోని అభివృద్ధి పనులపై సీఎంకు కృతజ్ఞత సభగా తెరాస దీనిని పేర్కొంటోంది. ప్రధానంగా సాగర్ ఎడమ కాల్వ అభివృద్ధి ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందించడం, ఫ్లోరైడ్ నుంచి విముక్తం చేయడంతో పాటు కొత్తగా ఎత్తిపోతల పథకాలు, డిగ్రీ కళాశాల ఇతర పనులను ఎన్నికల అస్త్రాలుగా తెరాస ప్రచారం చేయనుంది. మంత్రి జగదీశ్‌రెడ్డి దగ్గరుండి ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి సభ ఏర్పాట్లను చేయించగా... శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పనులను పరిశీలించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈ సభకు కార్యకర్తలు, రైతులు, ప్రజలను సమీకరిస్తున్నారు.
సీఎం ఏంచెబుతారో?
నాగార్జునసాగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు కొద్దిరోజుల్లోనే జరిగే వీలుంది. దీంతోపాటు త్వరలో రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికలున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో సీఎం ఏం మాట్లాడుతారోనని ఆసక్తి నెలకొంది. మరోవైపు సాగర్ ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపైనా సీఎం సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది.
పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్లీ అక్కడే..
2003లో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వర్షాభావం ఏర్పడింది. సాగర్ ఎడమకాల్వ పరిధిలో వేసిన నార్లు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీనిపై అప్పటి తెరాస నాయకులు జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో రైతులు కేసీఆర్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. కుడి కాల్వ కింద ఏపీకి నీటిని ఇస్తున్నారని తమపై వివక్ష చూపిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కేసీఆర్.. సాగర్ ఎడమకాల్వ కింద పంటలకు నీళ్లివ్వాలనే డిమాండుతో ఆగస్టు 19 నుంచి 23 వరకు కోదాడ నుంచి పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర చివరి రోజైన ఆగస్టు 23న హాలియాలో భారీ బహిరంగసభను నిర్వహించారు. తెలంగాణ వస్తే ఎడమకాల్వ ఆయకట్టుకు పూర్తి న్యాయం చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆనాడు ఇచ్చిన హామీలు నెరవేర్చినందున... నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చేలా మళ్లీ 17 ఏళ్ల తర్వాత తెరాస అక్కడే సభను ఏర్పాటు చేసింది.