Ap Leaders Joins in BRS: దేశవ్యాప్తంగా కేడర్ పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్న భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలుగు మాట్లాడే ప్రజలున్న అన్ని ప్రాంతాల్లో పట్టు పెంచుకునేందుకు వ్యూహ రచన చేస్తున్న గులాబీ దళపతి.. ఏపీలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి, జనసేన నేత తోట చంద్రశేఖర్‌కు ఏపీ నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది.
చంద్రశేఖర్ 2009లో ప్రజారాజ్యం తరఫున గుంటూరు, 2014లో వైకాపా నుంచి ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేశారు. 2019లో జనసేన నుంచి గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానం బరిలో దిగి ఓడిపోయారు. జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌తో పాటు.. వివిధ పార్టీలకు చెందిన పలువురు విశ్రాంత అధికారులు ఇవాళ బీఆర్ఎస్లో చేరనున్నారు. తెలంగాణ భవన్‌లో గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానించనున్నారు.
మాజీ మంత్రి, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి రావెల కిషోర్ బాబు కూడా ఇవాళ బీఆర్ఎస్లో చేరనున్నారు. ఏపీలో 2014 నుంచి 2018 వరకు తెదేపా హయాంలో మంత్రిగా చేసిన రావెల కిషోర్ బాబు 2020 నుంచి భాజపా ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. మరో విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి ఇవాళ భారాస తీర్థం పుచ్చుకోనున్నారు. పార్థసారథి 2019లో అనకాపల్లి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
అనంతపురానికి చెందిన టీజే ప్రకాష్ గులాబీ కండువా కప్పుకోనున్నారు. టీజే ప్రకాష్ 2008లో అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానంలో ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వీరితో పాటు ముమ్మిడివరం, పి.గన్నవరం, కొత్తపేట, రామచంద్రపురం ప్రాంతాల నుంచి పలువురు పార్టీలో చేరనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఏపీ నుంచి చేరికల సందర్భంగా కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనే అంశంపై రాజకీయ ఆసక్తి నెలకొంది. ఏపీలో బీఆర్ఎస్ వైఖరిపై.. కేసీఆర్ కొంత స్పష్టతనివ్వొచ్చునని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇవీ చదవండి: