పెన్నా కేసులో ఏపీ సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులపై(JAGAN CBI CASES) సీబీఐ, ఈడీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ కేసులో జగన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలను ఈ నెల 6కు వాయిదా వేసింది. దీనితోపాటు రాష్ట్ర మంత్రి సబిత, శామ్యూల్, రాజగోపాల్ వేసిన డిశ్చార్జ్ పిటిషన్ల వాదనలను కూడా వాయిదా వేసింది.
ఈడీ కేసుల విచారణపై సుప్రీంకు వెళ్తామన్న వైకాపా ఎంపీ విజయసాయి.. విచారణను వాయిదా వేయాలని కోరారు. ఎంపీ విజయసాయిరెడ్డి(MP VIJAYASAI REDDY) అభ్యర్థనపై తమకు అభ్యంతరం లేదని ఈడీ కోర్టుకు తెలపడంతో విచారణ ఈ నెల 9కి వాయిదా పడింది. వీటితోపాటు ఎమ్మార్ విల్లాల విక్రయాలపై సీబీఐ, ఈడీ కేసుల విచారణను 15కు ధర్మాసనం వాయిదా వేసింది.
సీబీఐ కోర్టులో సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు..
అక్రమాస్తుల కేసులో లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జ్‌షీట్ నుంచి తనను తొలగించాలని కోరుతూ.. సీఎం జగన్ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తన ప్రమేయం ఏమీ లేదన్న ఆయన.. ఛార్జ్‌షీట్ నుంచి తొలగించాలని కోరారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య కూడా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికీ డిశ్చార్జి పిటిషన్లు వేయని నిందితులకు చివరి అవకాశం ఇస్తున్నామని స్పష్టం చేస్తూ న్యాయస్థానం విచారణను సెప్టెంబరు 3కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: AP CM Jagan: గృహ నిర్మాణ ప్రాజెక్టుల ఛార్జ్‌షీట్ నుంచి తొలగించండి