కరోనా నిర్ధారణకు నిర్వహిస్తున్న యాంటీజెన్ పరీక్షల ఫలితాపత్రాలు సంబంధితులకు వెంటనే అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ సన్నాహాలు చేసింది. ఆర్‌టీ పీసీఆర్ పరీక్షల్లో ఫలితాలు వచ్చేందుకు రెండు, మూడు రోజులు పడుతుండటంపై విమర్శలు వస్తుండడం వల్ల.. యాంటీజెన్ పరీక్షలను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.
ఒకపక్క ఆర్‌టీ పీసీఆర్ పరీక్షలు కొనసాగిస్తూనే.. పెద్దసంఖ్యలో యాంటీజెన్ పరీక్షలనూ నిర్వహిస్తోంది. ఈఫలితాలు 30 నిమిషాల్లోపే వెల్లడైనా.. పాజిటివా? నెగెటివా? అని నిర్ధారించిన ఫలితాపత్రాన్ని వెంటనే ఇవ్వడం లేదు. దీనితో పాజిటివ్ వచ్చిన బాధితుల్లో ఆందోళన కొనసాగుతోంది. లక్షణాలు లేకున్నా, స్వల్పంగా ఉన్నా ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉండమని వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లో చికిత్స పొందుతున్న సమయంలో లక్షణాలు తీవ్రమైతే ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. బాధితులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినా.. ఫలిత పత్రం లేకపోతే ఏ ఆసుపత్రిలోనూ చేర్చుకోరు.
ఈ ఇబ్బందులపై పలు ఫిర్యాదులు వెల్లువెత్తడం వల్ల.. సత్వరమే సమస్యను పరిష్కరించడంపై ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. ఈ విషయంపై మంగళవారం ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వహించింది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. కరోనా పరీక్ష చేయించుకున్న వ్యక్తి వివరాలను అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో పొందుపర్చడం, ఫలితం వెల్లడవగానే సంబంధిత సమాచారాన్ని చేర్చి.. అక్కడికక్కడే ఫలిత పత్రాన్ని ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుంచే జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొన్ని పరీక్ష కేంద్రాల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చామని, కొద్దిరోజుల్లోనే ఫలిత పత్రమిచ్చే ప్రక్రియ అన్నిచోట్లా ప్రారంభమవుతుందని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
ఇవీచూడండి: జీహెచ్‌ఎంసీలో కంటైన్మెంట్ జోన్లు.. అడిషనల్ కమిషనర్లకు బాధ్యతలు