Amit Shah Tour: కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయంలో అమిత్ షాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ నేతలు ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, రాజాసింగ్, పొంగులేటి సుధాకర్, సోయం బాపురావు, ఈటల రాజేందర్, విజయ శాంతి, లక్ష్మణ్, వివేక్ వెంకట స్వామి, ఇంద్ర సేనా రెడ్డి, డీకే అరుణ, బండ కార్తీక తదితరులు స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట్ నుంచి ఉప్పల్ రామంతపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(సీఎఫ్ఎస్ఎల్)కు అమిత్‌షా బయలుదేరారు.
కోర్ కమిటీతో మీటింగ్..: సీఎఫ్‌ఎస్‌ఎల్‌లో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను అమిత్ షా ప్రారంభించారు. ల్యాబ్ విశేషాల గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. కాసేపట్లో భాజపా కోర్ కమిటీతో అమిత్ షా సమావేశం కానున్నారు.
అనంతరం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో భారీ సభ ఏర్పాటు చేశారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో 31 రోజులపాటు సుమారు 400 కి.మీకు పైగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింది. రాత్రి 8 గంటల వరకు జరిగే బహిరంగ సభలో పాల్గొని.. ప్రజలను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగిస్తారు. సభ అనంతరం శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరిగి దిల్లీ పయనమవుతారు.
ఇవీ చదవండి: 'ఏ మొహం పెట్టుకుని వస్తారు'.. అమిత్‌షాకు రేవంత్ రెడ్డి 9 ప్రశ్నలు