కొత్త చట్టం ద్వారా వ్యవసాయ భూ క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ పూర్తికాగానే మ్యుటేషన్ వెంటనే పూర్తికానుంది. తెలంగాణ రాష్ట్ర సమగ్ర భూ దస్త్రాల నిర్వహణ విధానంలోని (టీఎస్ ఐఎల్‌ఆర్‌ఎంఎస్-ధరణి) సమాచారం ఆధారంగా ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ పూర్తికానుంది. 2017లో భూ దస్త్రాల ప్రక్షాళన (ఎల్‌ఆర్‌యూపీ) నిర్వహించడంతో దాని ఆధారంగా ఈ కొత్త విధానాన్ని రూపొందించారు. ఇప్పటికే ప్రభుత్వం రైతులకు డిజిటల్ పాసు పుస్తకాలను అందజేసింది. రైతుల భూ దస్త్రాలకు ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లను జతచేసింది. వాటి ఆధారంగా లావాదేవీ పూర్తికాగానే రైతు ఫోన్‌కు సంక్షిప్త సమాచారం అందే విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఇకపై ప్రభుత్వం తహసీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అధికారాలను అప్పగిస్తోంది.
కొత్త చట్టం ప్రకారం 592 తహసీల్దారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఒకేచోట భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అందుబాటులోకి రానున్నాయి. వ్యవసాయేతర భూములకు మాత్రం ప్రస్తుతం ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న 1971 నాటి భూ యాజమాన్య హక్కుల చట్టానికి 1989లో ఒక సవరణ తీసుకొచ్చారు. తాజాగా ఆ చట్టాన్ని ఉన్నతీకరిస్తూ సవరణ చట్టం ఆర్‌ఓఆర్-2020ని రూపొందించారు. పాత చట్టాల ప్రకారం భూమికి ఒకసారి హక్కులు మాత్రమే కల్పించే వీలుంది. తాజా చట్టంతో నిత్య అవసరాలకు వీలుగా (అప్‌డేషన్) హక్కుల మార్పిడికి వీలు కలగనుంది. సాంకేతికత ఆధారంగా రెవెన్యూ పరిపాలనను నిర్వహించేందుకు కొత్త చట్టం వీలు కల్పిస్తుంది.
త్వరలో భూ సమగ్ర సర్వే..
రాష్ట్రంలో భూములకు పూర్తి స్పష్టత తీసుకొచ్చేందుకు ప్రభుత్వం త్వరలో సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టబోతోంది. 1936 నాటి సర్వే సమాచారమే ఇప్పటివరకు అందుబాటులో ఉండటంతో దానిని ఉన్నతీకరించాలని నిర్ణయించింది. మొత్తం 10,823 రెవెన్యూ గ్రామాల్లోని భూముల సమగ్ర సర్వేను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని భావిస్తోంది. దీంతోపాటు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ల పేర్లను మార్చనుంది.
ఇదీచూడండి.. ఎల్ఆర్ఎస్ సులభం... వెబ్‌సైట్, మొబైల్ యాప్‌తో దరఖాస్తులు