Asara Pentions and Kalyan Lakshmi in Telangana Budget: గత బడ్జెట్లో చెప్పిన విధంగా 57ఏళ్లు నిండిన వారికి పింఛన్ ఇస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ మేరకు 2022లో కొత్తగా 8,96,592 మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేస్తున్నామని, ఈ బడ్జెట్‌లో రూ.12,000 కోట్లు ప్రతిపాదించినట్లు వెల్లడించారు.
పరిపాలనకు మానవీయ పరిమళాలను అద్దుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి సింహభాగం నిధులను వెచ్చిస్తోందన్నారు. గత ప్రభుత్వాలు కంటి తుడుపుగా రూ.200 పింఛన్ ఇచ్చాయని.. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ కింద ఇచ్చే మొత్తాన్ని రూ.2,016కు, దివ్యాంగులకు రూ.3,016 చేసిందని గుర్తు చేశారు.
ప్రజల కష్టాలెరిగిన ప్రభుత్వం గనుక మానిఫెస్టోలో పేర్కొనక పోయినా, ఎవరూ డిమాండ్ చేయకపోయినా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, పైలేరియా బాధితులకు, డయాలసిస్ పేషంట్లకు సైతం రూ.2,016 పింఛన్ నెలనెలా అందజేస్తున్నట్లు గుర్తుచేశారు. 2014లో పింఛన్లు పొందే లబ్దిదారుల సంఖ్య 29,21,828 ఉండేదని.. వీరి కోసం ప్రతిఏటా 861 కోట్లు ఖర్చయ్యేవని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆసరా పింఛన్ లబ్దిదారుల సంఖ్యను ప్రభుత్వం 44,12,882 మందికి పెంచిందని చెప్పారు. వీరి పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రతిఏటా 11,628 కోట్లు ఖర్చు చేస్తున్నదని తెలిపారు.
రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.54,989 కోట్లలను ఆసరా పింఛన్లుగా లబ్ధిదారులకు అందించినట్లు ప్రకటించారు. గత బడ్జెట్లో చెప్పిన విధంగా 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్ ఇవ్వటం జరుగుతోందని చెప్పారు. ఈ మేరకు 2022లో కొత్తగా 8,96,592 మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని, ఇందుకోసం రూ.12,000 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి చెప్పారు.
కల్యాణలక్ష్మి / షాదీ ముబారక్:
- ఆడ పిల్లల పెండ్లి ఖర్చులు భరించలేక నిరుపేద కుటుంబాలు పడుతున్న బాధలను చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్, వారి భారాన్ని తగ్గించాలనే సదుద్దేశంతో మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకాన్ని అమల్లోకి తెచ్చారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ పథకం కింద కుల మతాలకతీతంగా పేదింటి ఆడపిల్లల పెండ్లి ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1,00,116 ఆర్ధిక సాయం అందిస్తున్నారని తెలిపారు.
- ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 12 లక్షల 469 మంది ఆడపిల్లలకు పెండ్లి ఖర్చుల కింద 10,416 కోట్లు సాయం అందించారని వెల్లడించారు. 18 ఏళ్లు నిండిన ఆడ పిల్లలకే కల్యాణ లక్ష్మి సాయం వర్తిస్తుండటంతో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోయాయని, కల్యాణలక్ష్మి / షాదీ ముబారక్ కోసం ఈ వార్షిక బడ్జెట్లో రూ.3,210 నిధులు ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: