చారిత్రక పోరాట ఘట్టమైన క్విట్ ఇండియా ఉద్యమం ఆగస్టు 9న రైతు విముక్తి దినంగా నిర్వహించాలని అఖిల భారత రైతు సమన్వయ సమితి ప్రకటించింది. కార్పొరేట్ శక్తులను తరమండి.. రైతాంగాన్ని కాపాడండి అనే నినాదంతో కార్యక్రమాలు చేయాలని రైతాంగం, కౌలురైతులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న శ్రమజీవులకు ఆలిండియా కిసాన్ సభ కేంద్ర కమిటీ పిలుపుపనిచ్చింది.
హైదరాబాద్ విద్యా నగర్‌లోని మార్క్స్ భవన్లో ఏఐకేఎస్‌సీసీ ప్రతినిధులు వేములపల్లి వెంకట రామయ్య, టీ సాగర్, పశ్య పద్మ తదితరులు సమావేశమయ్యారు. కార్పొరేట్లకు వ్యవసాయాన్ని కట్టబెట్టే అత్యవసర పరిస్థితి రద్దు చేయాలని కమిటీ డిమాండ్ చేసింది. వ్యవసాయ ఉత్పత్తులు ఎవరికైనా, ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ, కాంట్రాక్టు వ్యవసాయలకు సంబంధించిన కేంద్ర ఆర్డినెన్సులు రద్దు చేయాలన్నారు. కేంద్ర విద్యుత్ సంస్కరణల బిల్లు రద్దు చేయాలని వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర హక్కు చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ రైతు బంధు పథకం అమలు చేయాలని కోరారు. రైతులు, కౌలు రైతులు, పోడు రైతులు, వ్యవసాయ కూలీలందరికీ రుణ విమోచన కమిషన్ ఏర్పాటు చేసే చట్టం చేయాలన్నారు. పంటలు నష్టపోయిన రైతులు, కౌలు రైతులు అందరికీ పూర్తి నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి, డిమాండ్ల సాధనకు గాను క్విట్ ఇండియా పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని, కరోనా నియమాలను పాటిస్తూ వచ్చే నెల 9న విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఆగష్టు 9న తేదీన తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఆన్లైన్ బహిరంగ సభలో ఆలిండియా కిసాన్ సభ జాతీయ కన్వీనర్ వీఎం సింగ్, జాతీయ నాయకులు హసన్ మొల్ల, ఆశిష్ మిట్టల్, మేధాపాట్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల