హైదరాబాద్లో స్వచ్ఛమైన గాలిని విషంగా మార్చే ప్రమాదకరమైన అతి సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 2.5), సూక్ష్మ ధూళి కణాల(పీఎం 10) తీవ్రత కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) నిర్దేశిత ప్రమాణాలలోపే నమోదవుతున్నట్లు నీరి జోనల్ కేంద్రం గుర్తించింది. పీఎం 10 తీవ్రత 30 శాతం తగ్గినట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మరో అధ్యయనంలో వెల్లడించింది.
ఆరు ప్రాంతాల్లో పరిశీలించి...
ఇక్రిశాట్(పటాన్‌చెరు), ఐడీఏ బొల్లారం, ఐడీఏ పాశమైలారం, సనత్‌నగర్, జూపార్కు, హెచ్‌సీయూ ప్రాంతాలలో ‘నీరి’ శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. పీఎం 10, పీఎం 2.5, సల్ఫర్‌డయాక్సైడ్(ఎస్‌వో2), నైట్రోజన్ డయాక్సైడ్(ఎన్‌వో2) 24 గంటల సగటు తీవ్రత లెక్కించారు.
లాక్‌డౌన్ కంటే ముందు పీఎం 10 తీవ్రత ఘనపు మీటరు గాలిలో 78 మైక్రోగ్రాముల నుంచి 172 మైక్రోగ్రాముల వరకు ఉంది. పీఎం 2.5.. 40 ఎంజీల నుంచి 52, ఎన్‌వో2 పరిశీలిస్తే 28.2 ఎంజీల నుంచి 54.4, ఎస్‌వో-2.. 5.2 ఎంజీల నుంచి 6.9 ఎంజీల వరకు ఉంది. ప్రస్తుతం పీఎం 10.. 50 శాతం, పీఎం 2.5.. 35-40 శాతం, ఎన్‌వో2.. 25-50 శాతం తగ్గింది.
టీఎస్‌పీసీబీ అధ్యయనంలోనూ...
స్వచ్ఛమైన గాలిని కలుషితం చేసే సూక్ష్మ ధూళి కణాల(పీఎం 10) తీవ్రత లాక్‌డౌన్‌లో భారీగా తగ్గినట్లు తాజాగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ) కూడా తేల్చింది. అంతకు ముందు సగటు ఘనపు మీటరు గాలిలో 89 ఎంజీలు నమోదు కాగా ఇప్పుడు 63 ఎంజీలకు తగ్గినట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లోని కాలుష్య నమోదు కేంద్రాల్లో మార్చి 1 నుంచి 21 వరకు, మార్చి 24-ఏప్రిల్ 26 వరకు నమోదైన గణాంకాలను సేకరించి వేర్వేరుగా సగటు లెక్కించారు.