రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జల్సాల కోసమే ప్రజా ఆస్తులను తెగ నమ్ముతున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్నది ప్రజాపాలన కాదని.. దివాళా కోరు పాలన అని విమర్శించారు. ప్రభుత్వాలు ట్రస్టీలు మాత్రమేనని... ఓనర్లు కాదన్న ఆయన.. ఆస్తులను కాపాడాలి కానీ అమ్ముకోకూడదని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన సమయంలో ధనిక రాష్ట్రమని ఇప్పుడు తెరాస ఏడేళ్ల పాలనలో నాలుగు లక్షల కోట్లు అప్పుల రాష్ట్రంగా మారిందని ఆరోపించారు.
అప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు అమ్మకాలా ?
తెలంగాణ రాక ముందు భూముల వేలం వ్యతిరేకించి ఇప్పుడు వారే ఎందుకు విక్రయిస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో భూములు అమ్మలేదా అంటూ హరీశ్‌రావు ప్రశ్నించారన్న శ్రవణ్.... ఆ సమయంలో సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. తక్షణమే భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భావితరాల కోసం భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని శ్రవణ్ అన్నారు.
2012లో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో భూములు అమ్ముతుండగా కేటీఆర్ నేతృత్వంలో ధర్నా చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఐటీ ఎగుమతులు భారీగా పెరిగాయని చెబుతున్న కేటీఆర్.. జీఎస్టీ, పెట్రోల్, లిక్కర్, రిజిస్ట్రేషన్లపై వస్తున్న ఆదాయం ఎటు పోతోందో చెప్పాలన్నారు. ఏడేళ్ల కాలంలో రూ.14 లక్షల కోట్ల ఆదాయం, 4 లక్షల కోట్ల అప్పులు మొత్తం కలిపి రూ.18 లక్షల కోట్లు ఏమయ్యాయని నిలదీశారు. దేశంలో ఒక చిన్న ప్రాంతీయ పార్టీ అయిన తెరాస నేడు దేశంలో అత్యంత ధనిక రాజకీయ పార్టీగా ఎలా అయిందని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
ఇదీ చూడండి: TPCC: పీసీసీ అధ్యక్ష పదవిపై ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఏమన్నారంటే!