ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన కోసం లక్ష కోట్ల రూపాయల నిధులు నాబార్డ్ నుంచి రీఫైనాన్స్ చేస్తున్నామని నాబార్డ్ ఛైర్మన్ డాక్టర్ చింత గోవిందరాజులు తెలిపారు. కొవిడ్-19 నేపథ్యంలో కీలక వ్యవసాయ రంగం, రైతుల పాత్ర అభినందనీయమని చెప్పారు. పశుసంవర్ధక రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 1500 కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నామని ప్రకటించారు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఆచార్య ఎన్జీ రంగా 120వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్-నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్-నార్మ్ ప్రాంగణంలో జరిగిన వెబినార్ సదస్సులో పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సమృద్ధి సాధన లక్ష్యంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, స్వయం సహాయక మహిళా బృందాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని గోవిందరాజులు వెల్లడించారు. అందుకోసం ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా 1 శాతం వడ్డీకే రుణం సదుపాయం కల్పిస్తూ రీఫైనాన్స్ చేస్తున్నామని స్పష్టం చేశారు. మూడు మాసాల కిందట ప్రారంభించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ఆ సంఘాలన్నీ గ్రామ స్థాయిలో బహుళ సేవలందించే వ్యాపార కేంద్రాలు కావాలన్నదే నాబార్డ్ లక్ష్యమని గోవిందరాజులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఔరా ఇస్రో: పీఎస్‌ఎల్‌వీ సీ-49 ప్రయోగం విజయవంతం