రాష్ట్రంలో దాదాపు 35 వేల ఎకరాలలో పత్తి విత్తనోత్పత్తి జరుగుతోందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Singireddy Niranjan reddy) తెలిపారు. దేశానికి అవసరమయ్యే పత్తి విత్తనాలు ఎక్కువగా మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి కావడం సంతోషంగా ఉందన్నారు. పత్తి విత్తన రైతులకు నష్టం జరుగకుండా.. విత్తనోత్పత్తి కంపెనీలు మనరాష్ట్రం నుంచి తరలిపోకుండా రైతులు, ఆర్గనైజర్లు, కంపెనీలు సమష్టి నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి సూచించారు. హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో విత్తన కంపెనీల ప్రతినిధులు, విత్తనోత్పత్తి రైతులతో ఆయన సమావేశమయ్యారు.
విత్తనోత్పత్తిలో జాతీయ, అంతర్జాతీయంగా మనకున్న ఖ్యాతి ఇనుమడించేలా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. పత్తి రైతుకు నాణ్యమైన విత్తనం అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రి సూచించారు. రాబోయే కాలంలో తెలంగాణలో పత్తి సాగు విస్తీర్ణం మరింత పెరగాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, విత్తన కంపెనీల ప్రతినిధులు, విత్తనోత్పత్తి రైతులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: