రాష్ట్రంలో వ్యవసాయ పథకాల అమలుపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా వ్యవసాయరంగం అభివృద్ధి , రైతుల సంక్షేమం దృష్ట్యా పథకాలకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయింపులు జరిపి ప్రత్యేకతను చాటుకుంది. కరోనా సంక్షోభంలోనూ రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలకు కేటాయింపులు సముచితంగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అన్ని రంగాలకు ప్రాధాన్యత...
బడ్జెట్‌లో ప్రభుత్వం అన్నిరంగాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆరేళ్లుగా సంక్షేమం, వ్యవసాయరంగం, నీటి పారుదల ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్న సర్కారు... ఈ ఏడాది అదేవిధంగా నిధులు కేటాయించింది. బడ్జెట్ ఆశాజనకంగా ఉందని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పొందేలా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర నీటిపారదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి. ప్రకాశ్ సూచించారు.
మరిన్ని నిధులు...
బడ్జెట్‌లో ప్రత్యేకించి సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చినా పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత-చేవెళ్ల, డిండి సహా 25 కొత్త ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయాలంటే మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని నీటిపారుదల నిపుణులు చెప్పారు. కీలకమైన వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధుల కేటాయించిన ప్రభుత్వం... వాటిని సక్రమంగా వినియోగించాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: 2 లక్షల కోట్లను దాటిన తెలంగాణ వార్షిక బడ్జెట్