సీసీ కెమెరాల్లో నటుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాద దృశ్యాలు
1. సాయిధరమ్‌తేజ్ శుక్రవారం రాత్రి 7:40 గంటలకు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు నుంచి రాయదుర్గం ఐకియా వైపు బయలుదేరారు.
2. మాదాపూర్ దుర్గం చెరువు తీగల వంతెనపై నుంచి వెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో కనిపించాయి.
3. తీగల వంతెన దాటి 1.3 కి.మీల పయనించగానే నోవార్టిస్ సమీపంలో ఆటోను ఎడమవైపు నుంచి దాటబోతుండగా బైక్ పడిపోయింది.
4. సంఘటన స్థలం నుంచి 50 మీటర్ల వరకు ద్విచక్ర వాహనం జారుకుంటూ వెళ్లింది. దీంతో సాయిధరమ్‌తేజ్ అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే స్థానికులు అంబులెన్సుకు ఫోను చేశారు.
5. ప్రమాద స్థలి నుంచి సుమారు 2.2 కి.మీ దూరంలో ఉన్న మెడికవర్ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు.
బల్దియాపై కేసు లేదా?
సినీ నటుడు సాయిధరమ్‌తేజ్ ప్రమాదానికి సంబంధించి అతి వేగంపై కేసు నమోదు చేసిన పోలీసులు అదే సమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన నిర్మాణ సంస్థ, ఎప్పటికప్పుడు రోడ్డుని శుభ్రం చేయని బల్దియాపైనా కేసులు పెట్టాలని సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్ పేర్కొన్నారు. దీనివల్ల అజాగ్రత్తగా వ్యవహరించేవాళ్లు అప్రమత్తమవుతారని ఆ మేరకు చర్యలు తీసుకుంటారని అభిప్రాయపడుతూ ఆర్‌పీ తన ఫేస్‌బుక్ పేజీలో రాసుకొచ్చారు. దీనికి నెటిజన్ల మద్దతు లభిస్తోంది.
తప్పిన ప్రమాదం
నటుడు సాయిధరమ్ తేజ్ ప్రమాదంతో ఆయన గురించి సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ మొదలైంది. నగరంలో గతంలో జరిగిన ప్రమాదాల్లో క్షతగాత్రులకు సాయం అందించిన పాత చిత్రాలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆయనకు ప్రమాదం జరిగిన తర్వాత స్పందించిన ఇతర వాహనదారులు, స్థానికులు వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. గోల్డెన్ అవర్‌లో తీసుకెళ్లడంతో భారీ ప్రమాదం తప్పిందని వైద్యులూ వెల్లడించారు.
నాడు సాయమందించి.. నేడు గాయపడి
ఏడాది క్రితం జూబ్లీహిల్స్ నుంచి వెళ్తుండగా కారులో తాను ప్రయాణిస్తున్న రోడ్డులో ఓ ద్విచక్రవాహనం ప్రమాదానికి గురైంది. క్షతగాత్రున్ని అక్కడున్న ఓ ట్రాఫిక్ పోలీసు సాయంతో తన కారులోనే ఆసుపత్రికి తరలించారు సాయితేజ్. రెండేళ్ల క్రితం ఫిలింనగర్ రోడ్డుపై ఓ యాచకుడు స్పృహ తప్పి పడిపోతే అటుగా తన కుటుంబంతో వెళ్తున్న ఆయన.. యాచకుడిపై నీళ్లు జల్లి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.
ఇవీ చదవండి: sai dharam tej: అతివేగం, నిర్లక్ష్యం వల్లే సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం: డీసీపీ
Over Speed: హైదరాబాద్ రోడ్లపై స్పోర్ట్స్ బైక్‌ల జోరు.. రెట్టింపు వేగంతో..!