MLAs Poaching Case Latest Update : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో నలుగురిని నిందితులుగా చేరుస్తూ మొయినాబాద్ పోలీసులు దాఖలు చేసిన మెమోను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు కొట్టేసింది. బీఎల్ సంతోశ్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌లను నిందితులుగా చేరుస్తూ.. గత నెల 22న మొయినాబాద్ పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేశారు. తుషార్, జగ్గుస్వామిలను అరెస్ట్ చేయడానికి.. వారెంట్‌ను కూడా దాఖలు చేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోశ్, రామచంద్ర భారతి వాట్సప్ సంభాషణలు జరిపారని.. ప్రభుత్వాన్ని పడగొట్టాలనే దురుద్దేశంతో కుట్ర పన్నారని పోలీసుల తరఫున ప్రత్యేక పీపీ వాదనలు వినిపించారు.
అక్టోబర్ 28న రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ స్వామిజీలను అరెస్ట్ చేసి వాళ్ల సెల్‌ఫోన్‌లను పరిశీలించినప్పుడు కీలక విషయాలు బయటికొచ్చినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. తెలంగాణలోనే కాకుండా దిల్లీ, ఏపీ, మధ్యప్రదేశ్‌లోనూ ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసు తరఫు న్యాయవాది ఏసీబీ కోర్టుకు తెలిపారు. మరోవైపు కేవలం రాజకీయ కక్షల కారణంగానే ఈ కేసు నమోదు చేశారని.. నలుగురికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న అనిశా ప్రత్యేక కోర్టు.. పోలీసులు దాఖలు చేసిన మెమోను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చూడండి..
దర్యాప్తు పేరుతో వేధిస్తున్నారు.. హైకోర్టును ఆశ్రయించిన లాయర్ శ్రీనివాస్
సింహయాజీపై అభిమానంతోనే విమానం టికెట్ బుక్ చేశా: న్యాయవాది శ్రీనివాస్