Young man selfie suicide in Hyderabad : ప్రస్తుత రోజుల్లో యువత ప్రేమించి.. ఆ ప్రేమ పెళ్లి వరకు తీసుకెళ్లే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో ఒకటి వారి పెళ్లికి తల్లిదండ్రుల అంగీకారం లేకపోవడం. ఇలాంటి సందర్భాల్లో పెద్దవారిని ఎదురించి పెళ్లి చేసుకోడం ఒకటైతే.. వారిని ఎదురించలేక ఆత్మహత్య చేసుకోవడం మరోకటి. అలానే హైదరాబాద్ జిల్లాలోని ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయిని కాదని వేరే వాళ్లని వివాహం చేసుకోవాలని తన ఇంట్లో వారు ఒత్తిడి చేశారు. దీంతో ఆ యువకుడు మనస్తాపానికి గురై.. తన స్నేహితులకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. మిత్రులు వీడియో ద్వారా లోకేషన్‌ని కనుక్కోని ఆ ప్రదేశానికి వెళ్లినా.. యువకుడి ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
పోలీసులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. : హైదరాబాద్ జిల్లా రామంతాపూర్‌లోని గోకుల్నగర్కి చెందిన సాంబరాజు(22) సికింద్రాబాద్‌లోని ఓ నగల దుకాణంలో పని చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఇంట్లో వాళ్లు ప్రేమించిన అమ్మాయిని కాదని.. వేరే యువతిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చి.. బేగంపేటలోని ఓ హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న బ్యాగులో చున్నీ తీసి.. ఫ్యాన్‌కి కట్టాడు. ఉరి వేసుకోవాలనుకునే ముందు తన స్నేహితులకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని.. ఫోన్లో దృశ్యాన్ని చూపించాడు. దీంతో సాంబరాజు మిత్రులు అప్రమత్తమై ఫోన్లోని లోకేషన్ ద్వారా తను ఉండే ప్రదేశానికి చేరుకున్నారు.
వారు వచ్చేలోపు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు ఉన్న గది తలుపులు అతని స్నేహితులు పగలగొట్టి కాపాడే ప్రయత్నం చేశారు. యువకుడిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మార్గమధ్యంలోనే యువకుడు మరణించినట్లు వైద్యులు చెప్పారు. దీంతో ఈ విషయం పోలీసులకు తెలియడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు బేగంపేట ఎస్సై జయచంద్రా రెడ్డి తెలిపారు. యువకుడి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు.
ఇవీ చదవండి: