125 Feet Statue of Ambedkar in Hyderabad: హైదరాబాద్ నగరం నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. 50 అడుగుల ఎత్తుతో పార్లమెంట్ ఆకృతిలో నిర్మించిన భవనంపై 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఉక్కు, కాంస్యం మిశ్రమంతో ఆ విగ్రహాన్ని రూపొందించారు. నోయిడాలో విడి భాగాలను తయారు చేసి ఇక్కడకు తీసుకొచ్చి భారీ క్రేన్ సాయంతో విగ్రహాన్ని రూపొందించారు. గాలి ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుని విగ్రహాన్ని సిద్ధం చేశారు. విగ్రహానికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి.
175 అడుగుల ఎత్తులో బాబాసాహెబ్ రూపం: విగ్రహం చుట్టూ ఇప్పటి వరకు ఉన్న.. ఇనుప రెయిలింగ్‌ని పూర్తి స్థాయిలో తొలగించారు. రెయిలింగ్ తొలగిస్తున్నప్పుడే విగ్రహానికి రంగులద్దడంతో 175 అడుగుల ఎత్తుతో బాబాసాహెబ్ రూపం.. అందరినీ అకట్టుకుంటోంది. విగ్రహం పాదాల చెంత గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు తుది దశలో ఉన్నాయి. బేస్‌మెంట్ చుట్టూ ఎర్రని ఇసుకరాయితో తీర్చిదిద్దుతున్నారు. విగ్రహం కింద ల్యాండ్ స్కేపింగ్ సహా ఇతరత్రా పనులన్నీ శరవేగంగా సాగుతున్నాయి.
Ambedkar Statue in Hyderabad: ఈనెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అందుకు అనుగుణంగా రేయింబవళ్లు పనులు కొనసాగిస్తున్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్కడే భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. దాదాపు లక్ష మందికి పైగా సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మంత్రులు, చట్టసభలసభ్యులు, కార్పోరేషన్ ఛైర్మన్లు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు హాజరుకానున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున.. రాష్ట్రంలోని అన్నిచోట నుంచి 35 వేల 700 మందిని.. ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేకంగా తరలించనున్నారు.
అంబేద్కర్ విగ్రహానికి హెలికాప్టర్‌తో పూలజల్లు కురిపించేలా ఏర్పాట్లు: అందుకు తగ్గట్లుగా అంబేడ్కర్ విగ్రహం పరిసరాల్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఐమాక్స్ పక్కనున్న ప్రాంతాన్ని బహిరంగ సభ కోసం సిద్ధం చేస్తున్నారు. పరిసరాల్లో రహదారుల మరమ్మత్తులు, అలంకరణ పనులు కొనసాగుతున్నాయి. ఈనెల 10 నాటికి అన్ని రకాల పనులు పూర్తి చేయాలని.. ఆ తర్వాత విగ్రహావిష్కరణ, బహిరంగ సభ పనులను చేపట్టాలని ఇప్పటికే సీఎం ఆదేశించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా అంబేద్కర్‌కి ఘనంగా నివాళి అర్పించేలా భారీ పూలమాల, హెలికాప్టర్‌తో పూలజల్లు కురిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంబేద్కర్‌కి సంబంధించిన పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సాంస్కృతిక నీరాజనం అర్పించనున్నారు.
ఇవీ చదవండి: