మరుగుజ్జుగా పుట్టినా... ఏనాడూ అధైర్యపడలేదు. తోటివారు హేళన చేస్తున్నా నవ్వుతూ బతికేశారు. అలా తనదైన సంకల్పంతో డిగ్రీ పూర్తి చేశారు. డ్రైవింగ్ లైసెన్సును పొందారు. ఇవి రెండు దక్కించుకున్న మరుగుజ్జు తెలుగురాష్ట్రాల్లో శివలాల్ మాత్రమే. తల్లిదండ్రులు గంగాధర్, రాజమ్మలకు జన్మించిన తొలి సంతానం. చిన్నప్పుడే తండ్రి చనిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఇంటర్ వరకు చదువుకుని.. డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఇతనికి ఇద్దరు తమ్ములు. వారు సాధారణంగానే ఉన్నారు.
చిన్నప్పటి నుంచే హేళన
చిన్ననాటి నుంచి కుటుంబ సభ్యులే కాకుండా పాఠశాలలోనూ తోటి విద్యార్థులు హేళన చేసేవారని శివలాల్ తెలిపారు. కుటుంబసభ్యుల మద్దతూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గేలి చేస్తే ఒక్కోసారి ఈ జీవితం ఎందుకో అని బాధపడేవాడినని... కానీ ఇంటర్మీడియట్ తన జీవితాన్నే మార్చేసిందని పేర్కొన్నారు. అవమానాలను పట్టించుకోకుండా... సాధించాలనే పట్టుదల పెరిగిందని చెప్పారు. ఆ తర్వాత డిగ్రీ కోసం హైదరాబాద్‌కు వచ్చి... అలా డిగ్రీ పూర్తి చేసినట్లు వివరించారు.
కారు డ్రైవింగ్‌లోనూ భేష్
శివలాల్ ప్రస్తుతం హైదరాబాద్ ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్నారు. భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఈయన భార్య చిన్మయ్ కూడా మరుగుజ్జు. కుమారుడు హితేష్ ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్నాడు. ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గతేడాది నవంబర్ 27న ఓ కారు కొనుక్కున్నారు. క్లచ్, బ్రేక్ వంటి వాటిన రీమోడలింగ్ చేయించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి అదే కారులో డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టారు. ఆరు నెలల్లో పూర్తిగా తర్ఫీదు పొందారు. మార్చి 12న లెర్నింగ్ లైసెన్స్... ఆగస్టు 6న పర్మినెంట్ లైసెన్స్ పొందారు. రాష్ట్రంలోని సుమారు 400 మంది మరుగుజ్జుల్లో డిగ్రీ పూర్తి చేసిన మొట్టమొదటి వ్యక్తి శివలాల్. అంతేకాకుండా మొదటగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మరుగుజ్జు కూడా ఈయనే.
నేను పొట్టివాడినని ఎవరూ అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. భార్యను ఎలా పోషిస్తావు? ఎలా సంరక్షిస్తావు? అంటూ నానారకాలుగా అని ప్రశ్నించే వారు. బీకాం వరకు చదువుకున్నా ఉద్యోగం లేదు. ఎన్నో ప్రయత్నాలు చేసినా రాలేదన్నారు. ప్రైవేట్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే అఫ్లికేషన్ చూసి ఇంటర్వ్యూలకు పిలిచే వారు... ఆ తర్వాత మరుగుజ్జు అని తిరస్కరించేవారు. శరీరానికి కాకుండా ప్రతిభకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాను.
-శివలాల్, మరుగుజ్జు
ప్రభుత్వం ఎంతోమంది దివ్యాంగులకు, మరుగుజ్జులకు ఎంతో సాయం చేస్తోందని శివలాల్ అన్నారు. కానీ తనకు మాత్రం అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకొని ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: Tollywood Drugs case: 12 మందికి ఈడీ నోటీసులు.. రేపు విచారణకు పూరీ జగన్నాథ్!