ETV Bharat / state

కరోనా కాలంలో 'గాంధీ'లో 950 కాన్పులు, 612 సిజేరియన్లు - కరోనా కాలంలో గాంధీ ఆసుపత్రిలో 612 సిజేరియన్లు

కరోనా కాలంలో గాంధీ ఆసుపత్రిలో 950 కాన్పులు, 612 సిజేరియన్లు జరిగాయి. కన్న తల్లుల్లా ఆసుపత్రి సిబ్బంది సపర్యలు చేశారు. ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ తల్లీబిడ్డలు కోలుకున్నారు.

950 deliveries and 612 caesareans at Gandhi Hospital during the Corona period
కరోనా కాలంలో 'గాంధీ'లో 950 కాన్పులు, 612 సిజేరియన్లు
author img

By

Published : Mar 5, 2021, 6:56 AM IST

నిండుచూలాలు. ప్రసవ సమయం సమీపిస్తోంది. ఒకవైపు రక్తహీనత, మరోవైపు బీపీ. ఆ స్థితిలో ఆమె కరోనా బారినపడడంతో గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. అయినవారెవరకూ దగ్గరకు రాలేని పరిస్థితుల్లో ఆమెకు గాంధీ సిబ్బంది అన్నీ తామే అయ్యారు. రెండు రోజుల అనంతరం ప్రసవం చేశారు. అదృష్టవశాత్తు శిశువుకు కరోనా సోకలేదు. బిడ్డను నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. 14 రోజులపాటు తల్లీబిడ్డలు వేర్వేరుగానే ఉన్నారు. పసివాడికి కొవిడ్‌ సోకుతుందన్న భయంతో పాలు పట్టి ఇవ్వడానికి కూడా ఆ తల్లి మనసు అంగీకరించలేదు.

మనసును పిండేసే సంఘటనలెన్నో

వైద్యులు నచ్చచెప్పి, తల్లి నుంచి పాలు తీసి, బిడ్డకు పట్టించేవారు. అక్కడి నర్సులే చిన్నారిని తల్లిలా లాలించారు. ఆయమ్మలే బాలింతకు సపర్యలు చేశారు. 14 రోజుల తర్వాత తల్లీబిడ్డలను ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపించారు. ఏడాది కిందటి కఠిన పరిస్థితుల్లో ఒక దృష్టాంతమిది. ఇలాంటి మనసును పిండేసే సంఘటనలెన్నింటికో గాంధీ ఆసుపత్రి సాక్ష్యంగా నిలిచింది. కరోనా సమయంలో 950 మంది వైరస్‌ బాధిత గర్భిణులకు ఇక్కడ పురుడు పోశారు. వీటిలో 338 సాధారణ కాన్పులు కాగా.. 612 సిజేరియన్లు చేయాల్సి వచ్చింది. ఈ స్థితిలో శస్త్రచికిత్స చేసి కాన్పు చేయడం సవాలే. పీపీఈ కిట్‌, ఎన్‌ 95 మాస్కు ధరించి ఆపరేషన్‌ థియేటర్‌లో రోజుకు 10-15 శస్త్రచికిత్సలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. విపరీతమైన పనిఒత్తిడిలో ఉన్నా, సహచరుల్లో కొందరు కొవిడ్‌ బారినపడుతున్నా వైద్యులు, సిబ్బంది మొక్కవోని ధైర్యంతో పనిచేశారు.

మీరే దేవుళ్లు!

అప్పటికే ఇంట్లో తాత, మామ కొవిడ్‌తో కన్నుమూశారు. తండ్రి సహా పలువురు వైరస్‌ బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ స్థితిలో 20 రోజుల పసికందు వాంతులు, విరేచనాలతో నీరసించిపోతుంటే.. తల్లి గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చింది. భయపడినట్లే జరిగింది. పసికందుకు కరోనా సోకిందని వైద్యులు చెప్పగానే, తల్లి ప్రాణం తల్లడిల్లింది. ఎలాగైనా బతికించమని కాళ్లావేళ్లాపడింది. ఆమెకు తోడుగా కుటుంబ సభ్యులెవరూ లేని దయనీయస్థితి. గాంధీ వైద్యులు రాత్రింబవళ్లు పసిగుడ్డును కంటికి రెప్పలా చూసుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని తల్లిని కూడా శిశువు పక్కనే ఉంచారు. వారి కృషి ఫలించింది. 25 రోజుల చికిత్సానంతరం కోలుకున్న తన బిడ్డను తీసుకొని ఇంటికెళ్తూ.. వైద్యులనుద్దేశించి ఆ తల్లి చెమ్మగిల్లిన కళ్లతో అన్న మాట ఒకటే.. ‘మీరే దేవుళ్లు!’.

వెంటిలేటర్‌పైకి వెళ్లి..

మూడేళ్ల చిన్నారికి నిమోనియా సోకింది. పరీక్షల్లో కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. తల్లి వేలు పట్టుకొని బుడి బుడి అడుగులతో ఆసుపత్రికి వచ్చిన పిల్లాడు.. తీవ్ర అస్వస్థతతో రెండు రోజుల్లోనే వెంటిలేటర్‌పైకి వెళ్లాల్సి వచ్చింది. గాంధీ పిల్లల వైద్యులు, మత్తు మందు నిపుణులు అహర్నిశలు శ్రమించడంతో అయిదు రోజులకు చిన్నారి నెమ్మదిగా కోలుకున్నాడు. శ్వాసకోశాల నుంచి వెలుపలికి గొట్టం వేయాల్సి వచ్చింది. ఆ శస్త్రచికిత్స కూడా విజయవంతమైంది. 20 రోజుల అనంతరం చిన్నారి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు.

డాక్టర్‌ జి.మహాలక్ష్మి

'కొవిడ్‌ బాధితులకు ప్రసవాలు ఎలా చేయాలో అప్పట్లో మార్గదర్శకాలు కూడా లేవు. వారి సహాయకులు కూడా వెంట ఉండలేని పరిస్థితి. ఇప్పుడా గడ్డు కాలాన్ని తలచుకుంటే ఒళ్లు జలదరిస్తోంది. చికిత్స అనంతరం వారు క్షేమంగా, ఆరోగ్యంగా ఇళ్లకెళ్తూ రెండు చేతులు జోడించి నమస్కరించిన ఆ క్షణాలు ఇప్పటికీ నాకు ఎనలేని సంతృప్తినిస్తోంది.'

- డాక్టర్‌ జి.మహాలక్ష్మి, గాంధీ ఆసుపత్రి గైనకాలజీ విభాగాధిపతి

మా దగ్గరకు ఎప్పుడొస్తావ్‌!

డాక్టర్‌ సుచిత్ర

'కరోనా సమయంలో మాకు ఇంటి వద్ద కూడా ఉద్విగ్న వాతావరణం ఉండేది. పిల్లలిద్దరినీ మా పుట్టింటికి పంపించాం. మా వారు స్పెషల్‌ పోలీసు 8 బెటాలియన్‌లో వైద్యాధికారి కావడంతో విధుల్లో బిజీగా ఉండేవారు. ఒకరోజు మా అమ్మకు ఊపిరి ఆడటం లేదని ఫోన్‌ వస్తే, హుటాహుటిన ఇంటికి వెళ్లా. ఆమెకు పాజిటివ్‌ అని తేలింది. మా నాన్నకు, పిల్లలకు నెగెటివ్‌ రావడంతో వాళ్లను ఒక గదిలో ఉంచి, అమ్మకు చికిత్స అందించాం. ఆమె కోలుకున్నారు. దాదాపు నాలుగు నెలలు పిల్లలకు దూరం ఉన్నా. ‘అమ్మా! మా దగ్గరకు ఎప్పుడొస్తావ్‌! మళ్లీ మనం ఇంట్లో కలిసి ఎప్పుడుంటాం?’ అని వాళ్లు అప్పుడు అడుగుతుంటే... ఏం జవాబివ్వాలో తెలిసేది కాదు.'

- డాక్టర్‌ సుచిత్ర, పిల్లల వైద్యనిపుణులు, గాంధీ ఆసుపత్రి

వీడియోకాల్‌లో శిశువులను చూపి..

'కొవిడ్‌ బాధిత బాలింతలను, శిశువులను విడిగా ఉంచేవాళ్లం. తల్లి పాలను గిన్నెలో పట్టి చిన్నారులకు అందించేవాళ్లం. తల్లుల దగ్గరకు మేం ఎప్పుడు వెళ్లినా.. తమ ఆరోగ్యం గురించి కాకుండా వారి పిల్లలెలా ఉన్నారనే అడిగేవారు. వీడియోకాల్‌ చేసి బిడ్డలను చూపిస్తే, భోరున ఏడ్చేసేవారు. బిడ్డల బాగోగులను మేం చూస్తున్నామనే కృతజ్ఞత వారి కళ్లలో కనిపించేది.'

- శశికళ, మీనాక్షి, స్టాఫ్‌ నర్సులు, గాంధీ ఆసుపత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.