8 Year Old Kid Chekit Pragya Playing Drums: శివమణి రేంజ్‌లో డ్రమ్స్ వాయిస్తున్న ఈ బుడతడి పేరు తుములూరి చెకిత్ ప్రజ్ఞయ్. ఏపీలోని విజయవాడ రామవరప్పాడుకు చెందిన ఎనిమిదేళ్ల ఈ చిన్నారి చిన్నతనం నుంచే డ్రమ్స్ వాయించడంలో మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు. ఇప్పటికే నగరంలో అనేక వేదికల మీద ప్రదర్శనలిచ్చి పలువురి ప్రసంశలు అందుకున్నాడు. కళాకారుడైన అతడి తండ్రి మహేష్ కుమార్.. సంగీతంలో పలువురికి శిక్షణ ఇస్తుండటం చూసి.. నాలుగేళ్ల వయసు నుంచే చెకిత్ డ్రమ్స్ మీద ఆసక్తి పెంచుకున్నాడు.
తండ్రితో కలిసి విజయవాడలో ఎక్కడ సంగీత కార్యక్రమాలు జరిగినా వెళ్లేవాడు. ఆ కార్యక్రమంలో తన తండ్రి ఎలా వాయించేవాడో ఇంటికొచ్చాక చెకిత్ అలాగే వాయించడానికి ప్రయత్నం చేసేవాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు.. చెకిత్‌ను డ్రమ్స్ వాయించడంలో ప్రోత్సహించారు. చెకిత్ సినిమా పాటలతో పాటు జానపద, తీన్మార్ వంటి వాటికీ డ్రమ్స్ వాయించి ప్రముఖుల ప్రసంశలు పొందాడు. 2020 జూన్‌లో తానా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో డ్రమ్స్ వాయించి మొదటి బహుమతి పొందాడు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ మొదటి బహుమతి సాధించాడు.
విజయవాడలో ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న చెకిత్.. వివిధ రకాలుగా డ్రమ్స్ వాయిస్తూ పెద్దలతో శభాష్ అనిపించుకుంటున్నాడు. సంగీతంలో చెకిత్ ఆసక్తిని గమనించి చిన్నప్పటి నుంచే శిక్షణ ఇస్తున్నట్లు అతడి తల్లిదండ్రులు తెలిపారు. డ్రమ్స్‌తో పాటు చదువులోనూ ప్రతిభ కనబరుస్తున్నాడని చెబుతున్నారు. పెద్దయ్యాక మంచి సినీ సంగీత దర్శకుడిని కావాలన్నది తన లక్ష్యమని చెకిత్ అంటున్నాడు. ఎప్పటికైనా జాతీయ స్థాయి ప్రముఖ సినీ సంగీత దర్శకుల్లో ఒకడిగా ఉండాలనేది తన కోరికని చెబుతున్నాడు.
ఇవీ చదవండి: