నెల రోజుల క్రితం జరిగిన శాసనసభ సమావేశాల్లో రాష్ట్రప్రభుత్వం 8 బిల్లులను తీసుకొచ్చింది. శాసనసభ, మండలి ఉభయసభల్లోనూ ఆ బిల్లులు ఆమోదం పొందాయి. అందులో రెండు కొత్తవి కాగా.. మిగతా 6 చట్ట సవరణకు సంబంధించినవి ఉన్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డు ఏర్పాటు చేసేలా చట్టం చేసేందుకు సర్కార్ బిల్లు తీసుకొచ్చింది. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మారుస్తూ చట్టం రూపకల్పనకు బిల్లును తీసుకొచ్చింది. మరికొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతిచ్చేలా.. ప్రైవేట్ వర్సిటీ చట్టాన్ని సవరిస్తూ బిల్లు తెచ్చారు. జీహెచ్ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ చేస్తూ.. మరో బిల్లును తీసుకొచ్చింది. వాటితో పాటు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్టం, జీఎస్టీ చట్టాలను సవరిస్తూ బిల్లులను ప్రభుత్వం తీసుకొచ్చింది.
7 బిల్లులను సెప్టెంబర్ 12న.. ఒక బిల్లును మరుసటి రోజు శాసనసభలో ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 13న మొత్తం 8 బిల్లులు ఉభయసభల ఆమోదం పొందాయి. అసెంబ్లీ, శాసనమండలి ఆమోదం అనంతరం వాటిని రాజ్ భవన్కు పంపుతారు. గవర్నర్ వాటిని పరిశీలించి ఆమోదించాక.. గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురించాల్సి ఉంటుంది. అప్పుడు వాటికి చట్టరూపం వచ్చి అమల్లోకి వస్తాయి. సాధారణంగా వారం, 10 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. కానీ ఉభయ సభల ఆమోదం పొంది నెల రోజులు గడుస్తున్నా.. ఇంకా అన్నింటికీ చట్టరూపం లభించలేదు.
జీఎస్టీ చట్ట సవరణ బిల్లును మాత్రం గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురించేందుకు అనుమతిస్తూ ఈ నెల 10న రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. అంటే ఆ ఒక్క బిల్లుకే ఇప్పటి వరకు ఆమోదం లభించింది. మిగిలిన 7 బిల్లుల్లో అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు.. రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది. కేంద్ర చట్టంతో ముడిపడి ఉన్నందున రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. మిగతా బిల్లులకు ఇంకా ఆమోదం లభించలేదు. 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉమ్మడి నియామక బోర్డు ద్వారా విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. అటవీ విశ్వవిద్యాలయ చట్టం అమల్లోకి వస్తే.. అందుకు లోబడే కొత్త విద్యా సంవత్సరం, తరగతులు ప్రారంభించనున్నారు. ప్రైవేట్ వర్సిటీ చట్ట సవరణ బిల్లు పరిస్థితీ అదే. పురపాలక చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తే.. కో ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంపు దిశగా ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టనున్నారు. బిల్లులు ఆమోదం పొంది చట్టరూపం కాకపోవడంతో ఆ ప్రక్రియలు మరింత ఆలస్యం కానున్నాయి.
ఇవీ చూడండి..
తెరాసను గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా: కేటీఆర్
రెండేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం.. ప్రేమించడం లేదని రైలు కింద తోసేసి..