ఆంధ్రప్రదేశ్లో తొలిదశ పల్లెపోరులో ఎన్నికలు జరుగుతున్న 3,249 పంచాయతీల్లో 15.91 శాతం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 12 జిల్లాల్లో 468 మంది వైకాపా మద్దతుదారులు, 22 మంది తెలుగుదేశం సానూభూతిపరులు, 27 మంది స్వతంత్రులు సర్పంచులుగా ఏకగ్రీవమయ్యారు.
చిత్తూరు జిల్లా@ 114
చిత్తూరు జిల్లాలో 454 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా ఏకంగా 114 చోట్ల సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. వారిలో 95 మంది వైకాపా బలపరిచిన వారుండగా.. 12 మంది తెలుగుదేశం సానుభూతిపరులు ఉన్నారు. మరో ఏడుగురు స్వతంత్రులు పోటీ లేకుండా గెలిచారు.
గుంటూరు జిల్లాలో 67..
గుంటూరు జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న తెనాలి రెవెన్యూ డివిజన్‌లో 18 మండలాల పరిధిలో 337 గ్రామాలకు గానూ 67 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 64 చోట్ల వైకాపా మద్దతుదారులు, 2 చోట్ల తెలుగుదేశం సానుభూతిపరులు, ఒకరు స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. కృష్ణా జిల్లా విజయవాడ డివిజన్‌లో 22 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
ఉభయగోదావరి జిల్లాల్లో ఇలా...
పశ్చిమగోదావరి జిల్లాలో 41 పంచాయతీలు ఏకగ్రీవం కాగా... 35 మంది వైకాపా మద్దతుదారులు విజేతలయ్యారు. ఐదుగురు స్వతంత్రులున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 366 పంచాయతీలకు గానూ.. 30 మంది సర్పంచులుగా ఏకగ్రీవమయ్యారు. విశాఖ పరిధిలో 43 పంచాయతీల్లో పోటీ లేకుండానే విజయం ఖరారైంది. శ్రీకాకుళం జిల్లాలో తొలిదశలో 37 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. నెల్లూరు జిల్లాలో 25 పంచాయతీల్లో అభ్యర్థులు పోటీ లేకుండానే గెలుపొందగా.. అందులో 23 స్థానాలను వైకాపా బలపరిచిన అభ్యర్థులు సొంతం చేసుకున్నారు. ప్రకాశం జిల్లాలో 35 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
కర్నూలు జిల్లాలో 52 మంది అభ్యర్థులు సర్పంచులుగా ఏకగ్రీవమయ్యారు. అనంతపురం జిల్లాలో తొలివిడతలో ఎన్నికలు కదిరి డివిజన్‌లో మాత్రమే జరుగుతుండగా.. 169 పంచాయతీల్లో కేవలం 6 ఏకగ్రీవమయ్యాయి.పలుచోట్ల ఉపసర్పంచ్ పదవితో పాటు కొన్ని వార్డులను తెలుగుదేశం మద్దతుదారులకు ఇవ్వాలనే ఒప్పందంతో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి.