Telangana Covid Cases: తెలంగాణలో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఓ వైపు ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తున్న తరుణంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య సైతం గణనీయంగా పెరుగుతోంది. వారం క్రితం వరకు రెండు వందలు దాటని కరోనా వైరస్ కేసులు ఇటీవల నిత్యం మూడు వందల పైకి చేరుతున్నాయి.
తాజాగా రాష్ట్రంలో 482 మందికి కొవిడ్ సోకినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీనితో ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 6,82,971కి చేరింది. మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందారు. దీంతో కొవిడ్ మరణాలు సంఖ్య 4,031కి చేరింది. వైరస్ నుంచి కోలుకుని 212 మంది ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలో ఇవాళ 38,362 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,048 యాక్టివ్ కేసులు ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ఈరోజు వచ్చిన కేసులలో జీహెచ్ఎంసీ పరిధిలో 294 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 55 కేసులు నమోద కాగా... మేడ్చల్ మల్కాజిగిరిలో 48 కేసులు వెలుగుచూశాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ సూచిస్తోంది. విధిగా కరోనా నిబంధనలను తప్పక ప్రతి ఒక్కరూ పాటించాలని పేర్కొంది. 15 నుంచి 18 ఏళ్ల వారికి ఇవాళ తొలి డోసు వ్యాక్సినేషన్ అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 24,240 మంది టీనేజర్లకు టీకా పంపిణీ చేసినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి: