భవ్య, అమృత, హర్షిణి. వీరు అమీర్‌పేటలోని సిస్టర్ నివేదితా పాఠశాలలో చదువుతున్నారు. చిత్రలేఖనమంటే ఇష్టమున్న వీరిని తల్లిదండ్రులు ప్రోత్సహించారు. డ్రాయింగ్ టీచర్ నరహరి సహకారంతో చిత్రలేఖనంలో రాణిస్తున్నారు. దీనిలో గొప్పేముంది అనుకుంటున్నారా? సమకాలీన అంశాలు, సహజ వనరుల పరిరక్షణపై విభిన్నంగా చిత్రాలు గీయడమే వీరి ప్రత్యేకత.
ఆకట్టుకునే చిత్రాలు...
ఈ విషయాన్ని గుర్తించిన నరహరి ప్రతి ఏటా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిర్వహించే డ్రాయింగ్ పోటీలకు వారిని పంపించారు. విద్యుత్ పొదుపుపై భవ్య, నీటి పొదుపుపై అమృత, భూ పరిరక్షణపై హర్షిణీ గీసిన చిత్రాలు నిర్వాహకులను ఆకట్టుకున్నాయి. వీటిలో భవ్య రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి అందుకుని... వచ్చే నెల దిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఓ స్వచ్చంధ సంస్థ అమృత, హర్షిణీలను బాలరత్న పురస్కారాలతో సత్కరించింది.
రెండు వందలకు పైగా బహుమతులు...
వీరే కాదు ఈ పాఠశాలలో చదివే విద్యార్థినీ, విద్యార్థులు ఏ డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న బహుమతి సాధించనిదే తిరిగిరారని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఇలా ఇప్పటివరకు 200కుపైగా బహుమతులు వచ్చాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం చక్కటి చిత్రాలు గీస్తూ... రేపటి పౌరులకు ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని ఇవ్వడానికి తమ విద్యార్థులు శ్రమిస్తున్నారని ప్రిన్సిపల్ జయంతి వెంకట్రామన్ హర్షం వ్యక్తం చేశారు.
చక్కటి భావాలను చెప్పగల శక్తి చిత్రలేఖనానికి ఉందని తెలుసుకున్న విద్యార్థులు... అభిరుచిని సహజవనరులు కాపాడేందుకు మలచి ప్రశసంలు పొందుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే నైపుణ్యాన్ని సాధిస్తూ... జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చూడండి: చైతన్య కళాశాల నీటి ట్యాంకర్ బీభత్సం.. ఒకరు దుర్మరణం