భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సిద్దారం పరిధిలోని పోడు భూముల్లో అటవీశాఖ ఆధ్వర్యంలోని కందకం పనులను జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య అడ్డుకున్నారు. పోడు సమస్యను ముఖ్యమంత్రి పరిష్కరిస్తానని చెబుతున్నప్పటికీ అటవీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.
40 ఏళ్ల నుంచి పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలను ఇబ్బందులు పెడుతున్నారని, మా నాన్నగారు సైతం ఈ ప్రాంతంలో వ్యవసాయం చేశారని కోరం కనకయ్య అన్నారు. కందకం పనులకొచ్చిన అటవీశాఖ అధికారి డీఆర్ఓ నరేశ్‌తో మాట్లాడారు. ముఖ్యమంత్రి నిర్ణయం వచ్చేవరకు ఆగాలని సూచించారు.
బెదిరించడం ఏంటి..?
తాము గూగుల్ ఎర్త్ పటం ప్రకారం వచ్చామని 45 ఎకరాలు కావాలని, పోడు రైతులను కోరామని, 30 ఎకరాలు ఇస్తామన్నారని అటవీశాఖ అధికారి అన్నారు. మీరు కందకం పనుల కోసం వచ్చి బెదిరించడం ఏంటి..? 45 ఎకరాలు, 30 ఎకరాలంటూ వాటాలు అంటున్నారని అటవీ సిబ్బందిని ప్రశ్నించారు.
ఎంతో వ్యయంతో యంత్రాలు తీసుకు వచ్చామన్న మాటకు సైతం డబ్బులు పోగు చేసి ఇవ్వమంటావా? అని ప్రశ్నించారు. జడ్పీ ఛైర్మన్ సూచనతో అటవీ అధికారులు వారు తెచ్చిన యంత్రాలను తీసుకొని వెళ్లిపోయారు. కందకం పనులు చేయడం లేదని చెబుతూ వాస్తవానికి మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
మళ్లీ వస్తే..
నేను వెళ్లాక ఎప్పుడైనా మళ్లీ కందకం పనుల కోసం వస్తే అడ్డుకోవాలని ఆదివాసి రైతులకు జడ్పీ ఛైర్మన్ సూచించారు. పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య రైతులకు అండగా నిలుస్తున్నారు. అటవీ అధికారుల కందకం పనులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'సికింద్రాబాద్ నియోజకవర్గంలో తెరాస తన సత్తా చాటింది'