Bhadradri: భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 23 వరకు ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో రూపంలో స్వామివారు దర్శనమిస్తుండగా.. ఏడో రోజైన నేడు శ్రీరామ అవతారంలో నిజరూపంలో స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయంలో అర్చకులు లక్ష్మణ సమేత సీతారాములకు విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. రేపు బలరామావతారంలో, 11న శ్రీకృష్ణావతారంలో స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. ఈనెల 13 వరకు నిత్య కల్యాణాలు రద్దు చేశారు.
భక్తులకు అనుమతి నిరాకరణ
దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నందున ప్రజలంతా ఒకచోట గుమికూడి ఉండరాదని, ర్యాలీలు సభలు నిర్వహించరాదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈనెల 12, 13న జరగనున్న తెప్పోత్సవం, ఉత్తరద్వార దర్శనాలకు భక్తులకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఈ రెండు కార్యక్రమాలను వేద పండితులు, అర్చకుల సమక్షంలో మాత్రమే నిర్వహిస్తామని తెలిపారు.
కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతునందున భక్తులకు అనుమతి నిరాకరించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆన్లైన్లో అమ్మిన టికెట్లకు సంబంధించిన నగదు తిరిగి భక్తులకు చెల్లిస్తామని చెప్పారు. ప్రజలు, భక్తులందరూ సహకరించి తెప్పోత్సవం ముక్కోటి ఏకాదశి వేడుకలకు హాజరుకావొద్దని కోరారు. గోదావరి తీరంలో జరుగుతున్న హంస వాహనం ఏర్పాట్ల పనులనూ నిలిపివేశారు.
పెరిగిన భక్తుల రద్దీ
భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. సెలవు దినాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల ఆలయ ప్రాంతాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. బంగారు పుష్పాలతో అర్చన చేశారు.
ఇదీ చదవండి: