భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది ఈ రాత్రికి ప్రమాదకర స్థాయి దాటి ప్రవహించవచ్చని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ హెచ్చరికలు జారీ చేసింది. రాత్రి 9 గంటలకు ప్రమాదస్థాయిపైన నాలుగు అడుగుల మేర గోదావరి నది ప్రవాహం ఉండవచ్చని పేర్కొంది.
53 అడుగులకు..
మధ్యాహ్నం 1.50గంటలకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు కలెక్టర్ ఎంవీరెడ్డి ప్రకటించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటి వరకుఅత్యధికంగా వరద వచ్చి గోదావరి 53 అడుగులకు చేరింది. భద్రాచలంలోని కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీలోనికి వరద నీరు చేరింది. ఆయా కాలనీల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. భద్రాచలంలో ప్రధాన రహదారులపైకి చేరిన వరద నీరు పారుతోంది. భద్రాచలం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి రామాలయం తూర్పు మెట్ల వరకు, భద్రాద్రి రామయ్య సన్నిధి అన్నదాత సత్రంలోకి వరదనీరు వచ్చింది. వరద నీటిలో కల్యాణకట్ట, స్నానఘట్టాలు మునిగాయి. భద్రాచలం కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీల్లోకి వరద నీరు చేరింది. ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. వరద పరిస్థితిపై కాసేపట్లో భద్రాచలంలో మంత్రి పువ్వాడ సమీక్షించనున్నారు.
ఆరేళ్లకు మళ్లీ..
2014 తర్వాత మళ్లీ ఆరేళ్లకు మళ్లీ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 2104లో సెప్టెంబర్ 8న 56.1 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం.. 2015 జూన్ 22 న 51 అడుగులకు చేరింది. 2016 జూలై 12న 52.4 అడుగులు, 2017 జూలై 20న 36.7 అడుగులు, 2018 ఆగస్టు 22న 50.0 అడుగులకు నీటిమట్టం చేరింది.
ఇదీ చూడండి : వచ్చే 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్ష సూచన