భద్రాద్రి జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ ఏడో కర్మాగారానికి చెందిన స్టోర్ నుంచి ఏకంగా రూ.63 లక్షల విలువైన పరికరాలు పట్టణంలోని ఓ ఇనుప దుకాణంలో బయటపడ్డాయి. ఈ విషయం జెన్కో సీఎండీ ప్రభాకరరావు వరకు వెళ్లింది. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర విజిలెన్స్ ఎస్పీ వినోద్‌కుమార్ సమగ్ర విచారణతోపాటు దిద్దుబాటు చర్యలూ ప్రారంభించారు. విద్యుత్తు కర్మాగారాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్)తోపాటే జెన్కో విజి‘లెన్స్’ ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. త్వరలో విద్యుత్కేంద్రాల్లో మరో అంచెలో విజిలెన్స్ ప్రత్యేక నిఘా ఏర్పాటుకానుంది.
గుట్టుగా సామగ్రి గుటుక్కు..
రాష్ట్రవ్యాప్తంగా 7 థర్మల్, 11 జల విద్యుత్తు కర్మాగారాలున్నాయి. పాల్వంచలో కేటీపీఎస్, మణుగూరులో బీటీపీఎస్ కొనసాగుతున్నాయి. అన్నిచోట్లా ప్రస్తుతం భద్రతను ఎస్పీఎఫ్ పర్యవేక్షిస్తోంది. ఆ విభాగం నిఘా వైఫల్యంతో ఏదో ఓ కర్మాగారం నుంచి విలువైన సామగ్రి చోరీకి గురవుతోంది. కొత్తగూడెం థర్మల్ విద్యుత్కేంద్రంలో గత ఆర్నెళ్ల వ్యవధిలో రెండు చోరీ ఉదంతాలు వెలుగుచూశాయి.
వేర్వేరు స్టోర్ల నుంచి ఆర్నెళ్ల క్రితం రూ.50 లక్షలు, ఇటీవల రూ.63 లక్షల విలువైన సొత్తు మాయమైంది. మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కర్మాగారం(బీటీపీఎస్)లో కొద్ది నెలల క్రితం సుమారు రూ.33 లక్షల విలువైన సామగ్రి మాయమైనట్లు విచారణలో తేలింది. ఆయా ఉదంతాల్లో అసిస్టెంట్ కమాండర్, ఏడీఈ, ఎస్పీఎఫ్ సిబ్బంది సహా మరో ఆర్టిజన్‌పై వేటు కూడా పడింది.
రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గతేడాది కాలంలో నాలుగు కర్మాగారాల్లో వెలుగుచూసిన చోరీ ఘటనల్లో సుమారు రూ.2.41 కోట్ల విలువైన సొత్తు పక్కదారి పట్టినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఆయా విచారణల్లో మరో రూ.52 లక్షల విలువైన సొత్తు కూడా చోరులపరమైనట్లు తేల్చారు. ఇలా ఇంటి దొంగలైన శాశ్వత, తాత్కాలిక అధికార సిబ్బందిపై చర్యలు చేపట్టారు. సొత్తు రికవరీకి ప్రయత్నిస్తున్నారు. రేపోమాపో విజిలెన్స్ సిబ్బందిని నియమించి నిఘా పటిష్ఠం చేయనున్నారు.
సీఎండీ ఆదేశాలతో ప్రత్యేక నిఘా
జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యుత్తు కర్మాగారాల్లో ఎస్పీఎఫ్‌తో పాటు అదనంగా విజిలెన్స్ నిఘా వ్యవస్థను నెలకొల్పనున్నట్లు జెన్కో విజిలెన్స్ ఎస్పీ వినోద్‌కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి సిబ్బంది నియామకంపై ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. త్వరలోనే ఈ కార్యాచరణ అమలులోకి రానుందన్నారు. పాల్వంచ కేటీపీఎస్‌లోని రూ.63 లక్షల చోరీ ఉదంతంపైనా ఉన్నతాధికారులకు నివేదించినట్లు ఎస్పీ వివరించారు.
విజిలెన్స్ నిఘా ఇలా..
* విద్యుత్కేంద్రంలో ఉన్న విడి పరికరాల నిల్వ కేంద్రాలు (స్టోర్స్), పరిసరాల్లో సీసీ కెమెరాలు, విద్యుత్తు దీపాల ఏర్పాటు.
* ఒక్కో కర్మాగారానికి కొత్తగా విజిలెన్స్ (జెన్కో) సీఐ, ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్ల నియామకం.
* విడిపరికరాల నిల్వ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతను ఏఈతోపాటు అదనంగా ఏడీఈకి అప్పగింత.
* వీరిద్దరిపై డీఈ, ఎస్‌ఈ, సీఈలతోపాటు ఎస్పీఎఫ్, విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణ.
* ఇక మీదట సామగ్రి చోరీ జరినట్లు తేలితే ఆ సొత్తును బాధ్యులైన అధికారుల వేతనాల్లోంచి రికవరీ చేస్తారు.
* కర్మాగారాల్లోకి వచ్చే వారెవరైనా గుర్తింపు కార్డులు ధరించాలి.
* చరవాణి, కెమెరాల వినియోగం పూర్తిగా నిషేధం.
* విధులు ముగించుకుని వెళ్లే సమయంలో ఆర్టిజన్ నుంచి సీఈ స్థాయి వరకు అందరి వాహనాల తనిఖీలు.